కమ్యూనిస్టు పార్టీలు కూడా కరెప్ట్ అయిపోయాయని ఆరోపణలు మొదలై చాలా రోజులైంది. కొన్ని సందర్భాల్లో వారి అవినీతిని ససాక్ష్యంగా నిరూపించే అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం దేశం మొత్తం మీద కేరళలో మాత్రమే వామపక్ష పార్టీల పాలన ఉండగా అక్కడ చాలా రోజులుగా అవినీతి ఏరులై పారుతోందని ఆధారాలు దొరుకుతున్నాయి. అందిన కాడికి దోచుకోవడానికి నాయకులు వెనుకాడని సందర్భాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. అందులోనూ అత్యున్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయనే కట్టల పాముగా మారారన్న ఆరోపణలు పెల్లుబికాయి. ఆయన స్వయంగా డబ్బులు పట్టుకుపోతున్నారని చెబుతున్నారు.
మాజీ పాత్రికేయుడి సంచలన ఆరోపణలు
సీపీఎం పత్రిక దేశాభిమానికి జీ. శక్తిధారన్ అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. కొంతకాలం క్రితం జరిగిన సంఘటనను ఆయన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేయడంతో అదీ విస్తుగొలిపే నిజంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయన్, సీపీఎం కార్యదర్శిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు చేతులు మారేవని శక్తిధారన్ ఆరోపించారు. ఎర్నాకులంలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ సెంటర్ కు విజయన్ దేశాభిమాని కార్యాలయం నుంచి రూ.2.35 కోట్ల రూపాయల నగదు తరలించారని ఆయన ప్రధాన ఆరోపణ. విజయన్ స్వయంగా వచ్చి పత్రికా కార్యాలయం గేట్ ముందు కారు ఆపి, ఆయనే లోపలికి వెళ్లి డబ్బులు తీసుకెళ్లారని శక్తిధారన్ చెప్పారు. ఒక హోటల్ పేరు ముద్రించిన రెండు కవర్లలో నగదు పట్టుకెళ్లారని ఆయన వెల్లడించారు. సీపీఎం పార్టీ అంత నగదు హ్యాండిల్ చేయదని అది ఎవరో ఇచ్చిన డబ్బులని కూడా శక్తిధారన్ విశ్లేషించారు.
నిలదీసిన కేరళ హైకోర్టు
అవినీతి సొమ్ము విషయంలో కేరళ హైకోర్టు కూడా విజయన్, ఆయన కుమార్తె వీణా తైకాండీ తీరును తప్పుపట్టింది. దాదాపు నెల జీతం తరహాలో వాళ్లు లంచాలు తీసుకుంటున్నారని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తేల్చింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన శక్తిధారన్… ఇప్పుడు విజయన్ మాఫియా కింగ్ పిన్ గా మారారని ఆరోపించారు. ఆయన కంప్యూటర్ ను పరిశీలిస్తే అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు దొరుకుతాయని చెప్పారు.
వీణకు కంపెనీల ముడుపులు
సీఎం కుమార్తె వీణా తైకాండీకి కొన్ని కంపెనీల నుంచి నెలవారీ ముడుపులు అందుతున్నట్లు గుర్తించారు. మూడేళ్లలో నెలవారీ చెల్లింపుల రూపంలో కొచ్చిన్ మినరల్స్ అండ్ రీటైల్ లిమిటెడ్ (సిఎమ్‌ఆర్‌ఎల్) అనే ప్రైవేట్ కంపెనీ నుండి రూ. 1.72 కోట్లు అందుకున్నట్లుగా ఆధారాలు దొరికాయి.ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మౌనం కూడా అనుమానాలు కలిగిస్తోంది. రెండు పార్టీలు కలిసిపోయాయని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ కూడా ముడుపుల్లో భాగస్వామిగా మారి విజయన్ ప్రభుత్వ దుశ్చర్యలను ప్రశ్నించడం లేదని బీజేపీ నిలదీస్తోంది.