రైతులు ఢిల్లీ చలో ఉద్యమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు. వాళ్ల సహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిన తర్వాత కూడా ఎందుకు రోడెక్కారు. కొన్ని డిమాండ్లు ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా ఎందుకు మంకుపట్టు పడుతున్నారు.వాళ్ల వెనుక ఎవరున్నారు. వాళ్లని ఎవరు నడిపిస్తున్నారు…..
ఒక రాష్ట్రం నుంచే ఎందుకు..?
ఇదో పెద్ద గేమ్ ప్లాన్ లాగే కనిపిస్తోంది. పంజాబ్ రైతులు మాత్రమే హర్యానా దాటుకుని రావడం వెనుక ఎవరో రెచ్చగొట్టారనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతులు 50 శాతం పైగా జనాభా ఉండగా…12 డిమాండ్లను అడ్డం పెట్టుకుని పంజాబ్ రైతులను మాత్రమే కొందరు రెచ్చగొట్టారనిపిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఐదు సార్లు ఈడీ సమన్లకు స్పందించలేదు.దానితో ఆరో సారి ఈడి నుంచి కేజ్రీవాల్ కు పిలుపు వెళ్లింది. ఈ సారి అరెస్టు తప్పదన్న చర్చ నడుమ డైవర్షన్ కోసం ఆప్ గేమ్ ప్లాన్ అమలు జరుపుతోందనిపిస్తోంది. ఢిల్లీలోనూ, పంజాబ్ లోనూ ఆప్ ప్రభుత్వమే ఉండటంతో వాళ్లు సులంభంగా రైతులను తమవైపుకు తిప్పుకోగలిగారు..కేజ్రీవాల్ అరెస్టు కాకుండా చూడాలి. దేశరాజధానిలో అల్లర్లు జరగాలన్నది ఆప్ లక్ష్యంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి..
లోక్ సభ ఎన్నికలే టార్గెట్
లోక్ సభ ఎన్నికలు మరో 50…60 రోజుల్లో జరగబోతున్నాయి. బీజేపీ నేతృత్వ ఎన్డీయేకు అఖండ మెజార్టీ ఖాయమని తేలిపోయింది. ఇండియా గ్రూపులో కీచులాటతో ఆ వర్గం వెలవెలబోతోంది. వాళ్లకి మొత్తం వంద స్థానాలు వచ్చే అవకాశం కూడా లేదు. ఇండియా గ్రూపులో ప్రతీ ఒక్కరూ డామినేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ ను దాటుకుని పోవాలన్న తపన ఉన్న పార్టీలో ఆప్ కూడా ఒకటి. ఎలాగైనా కార్మిక, కర్షక వర్గాలకు రెచ్చగొడితే తమకు లబ్ధి కలుగుతుందని ఆప్ విశ్వసిస్తోంది. ఆ క్రమంలోనే రైతులను ఉద్యమానికి ప్రోత్సహించినట్లుగా భావిస్తున్నారు. పంజాబ్ నుంచి రైతులు ఢిల్లీ వైపు ప్రయాణానికి ఆప్ వెన్నుదన్నుగా నిలిచిందని చెబుతున్నారు..
గమ్యంలేని ప్రయాణంలో…
పంజాబ్ రైతులు గమ్యంలేని ప్రయాణాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీని దిగ్బంధించి తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అప్పట్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయించినట్లే ఇప్పుడు ఎంఎస్పీని పొందాలనుకుంటున్నారు.అయితే కనీస మద్దతు ధరపై చట్టం చేయడం కుదరదని రైతులకు తెలియనిది కాదు. వ్యవసాయోత్పత్తుల ధరలకు నాలుగు రెట్లు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. దానితో కొందరు కుట్రపన్ని రైతులను రెచ్చగొడుతున్నారని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపిస్తున్నారు. పైగా ఎంఎస్పీని అమలు చేయాల్సిందీ రాష్ట్ర ప్రభుత్వాలైతే ఇందులో కేంద్రం చేయాల్సిందేమి ఉంటుందన్నది కూడా పెద్ద ప్రశ్నే అవుతుంది.