ఉగ్రవాదులు పొంచి ఉన్నారు. ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉన్నదో అర్థం కావడం లేదు. కశ్మీర్ నుంచి ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, హైదరాబాద్ వరకు ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించాయి. అక్కడక్కడ పట్టుబడుతున్న ఉగ్రమూకల ఇంటరాగేషన్ లో అనేక విస్తపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి..
ఢిల్లీని టార్గెట్ చేశారా ?
రాజధాని ఢిల్లీపై ఉగ్రవాదులు గురి పెట్టినట్లనుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దేశంలోకి ఎంటరై… రాజధాని వైపు వస్తున్నట్లుగా ఒక వార్త ప్రచారమైతే, ఇప్పటికే సేఫ్ జోన్లో కొందరు సెటిలై ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దానితో రెండు కోట్ల జనాభా ఉండే రాజధాని నగరాన్ని అణువణువునా జల్లెడ పడుతున్నారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర ఇంటెలెజెన్స్ సంస్తలు కలిసి నిఘాను పెంచి, సిటీలోకి వచ్చే అనుమానితులందరినీ ఒక కంట కనిపెడుతూ, అవసరమైతే ప్రశ్నిస్తున్నారు.
ఆ పాత షెల్ ఎక్కడిది…
ఇంటెలిజెన్స్ వర్గాల భయానికి కారణాలు లేకపోలేదు. ఢిల్లీలోని రోహిణి సెక్టార్- 28లో పాత షెల్ ఒక దొరకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఔటర్ – నార్త్ డిస్ట్రిక్ట్ పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపారు, రాకెట్ లాంఛర్ కు సంబంధించిన షెల్ గా ప్రాథమికంగా అనుమానం రావడంతో అసలు అది ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. షెల్ లోపల ఖాళీగా ఉన్నప్పటికీ..అది అక్కడి దాకా ఎలా వచ్చిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. షెల్ సంగతి తెలిసిన వెంటనే సమయపురి బద్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి ఇంటింటికి వెళ్లి పరిశీలించింది. ఎలాంటి అనుమానిత వస్తువు, అనుమానిత వ్యక్తులు కనిపించినా తమకు సమాచారం అందించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేసారు.
మోర్టార్లు, రాకెట్ లాంఛర్లు తెచ్చారా…
తాజా ఘటనతో ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ వర్గాలకు కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజధాని నగరంలోకి ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు పట్టుకొచ్చారా అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. పైగా కేరళ, కర్ణాటక సహా పలు చోట్ల పట్టుబడిన పీఎఫ్ఐ ఉగ్రవాదుల నుంచి అందిన సమాచారంతో పాటు బెంగళూరులో అరెస్టు చేసిన ఐదుగురు జిహాదీలు ఇచ్చిన సమాచారం కూడా అలెర్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతోంది. ఉగ్రవాదుల తాజా రాడార్లో ఢిల్లీ మహానగరం ఉన్నట్లుగా వారి విచారణలో తేలింది. ఢిల్లీలో విఐపీలు ఉండే ప్రాంతాలను ఉగ్రవాదుల దగ్గర ఉన్న మ్యాప్ లో గుర్తించి ఉండటంతో అక్కడ భద్రతను మరింతగా పెంచుతున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మరో పక్క ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ భద్రత కోసం ఇతర రాష్ట్రాల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. వేడుకలు ముగిసిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వారిని అక్కడే ఉంచుతారు. ఢిల్లీ పోలీసులతో కలిసి పనిచేస్తూ గట్టి నిఘాలో వారు భాగస్వాములు అవుతారు.