ఏపీ బీజేపీ ఎదగకుండా రెండు ప్రాంతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఎవరికైనా ఇది నిజమే కదా అనిపిస్తుంది. ఇంతకీ రెండు ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే… బీజేపీ తాము దగ్గరంటే తాము దగ్గర అని ప్రచారం చేసుకుంటున్నాయి. తాము.. బీజేపీ ఒకటేనని చెప్పుకుంటున్నాయి. అసలు సమస్య అక్కడే వస్తోంది.
బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్
ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి పది శాతం వరకూ ఓటు బ్యాంక్ ఉండేది. గుజరాత్, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లలో ఒకప్పుడు బీజేపీకి ఒక్క సీటే ఉండేది. ఇప్పుడు గుజరాత్ లో తిరుగులేని స్థానంలో ఉంది. కర్ణాటకలో నిన్నటి వరకూ అధికారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు ఉన్నా లేకపోయినా బీజేపీకి పది శాతం వరకూ ఓట్లు ఉండేవి. కొందరు బీజేపీ నేతలు గట్టి పోటీ ఇస్తూండేవారు. పొత్తులు లేనప్పుడు కూడా ఉభయగోదావరి జిల్లాలో బీజేపీకి పద్దెనిమిది శాతం వరకూ ఓట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కిషన్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉండేది.
ప్రాంతీయ పార్టీల కుట్రలతో బీజేపీ బలహీనం
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం.. ఏపీలో ప్రాంతీయ పార్టీలతో పరోక్షంగా అయినా సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొన్ని సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ ఎక్కువగా నష్టపోయింది. బీజేపీ మాకు వ్యతిరేకం కాదని అన్న భావన ప్రజల్లో పెంచుతున్నారు. రాజకీయ వ్యూహాలను ఆసరాగా చేసుకుని ప్రాంతీయ పార్టీల నేతలు ఎదిగే బీజేపీని మరింత పాతాళంలోకి నెట్టే ప్లాన్లు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీని పల్తెత్తు మాట అనేందుకు రెండు పార్టీలూ సాహసించడం లేదు. దీంతో అందరూ బీజేపీ మిత్రులేనన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఇది బీజేపీకి మాత్రం పూర్తి స్థాయిలో మైనస్ అవుతుంది.
మేం గెలిచినా బీజేపీకే మద్దతని ప్రాంతీయ పార్టీల ప్రచారం
ఏపీలో ఎవరు గెలిచినా బీజేపీ గెలిచినట్లే అనే అభిప్రాయాన్ని ప్రాంతీయపార్టీలు ప్రజలకు చెబుతున్నాయి. ఏ పార్టీ తరపున ఎంపీలు గెలిచినా మోదీకే సపోర్ట్ చేస్తారని అందుకే.. బీజేపీకి ఓటేయాల్సిన అవసరం లేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా మోదీ అనుకూల ఓట్లు కూడా ప్రాంతీయపార్టీలకే పడుతున్నాయి. అసలు వారి కుట్ర కూడా అదే. దీన్ని చేధిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి గట్టి నమ్మకంతో చెబుతున్నారు.