” స్టీల్ ప్లాంట్‌ “పై రాజకీయ నిరుద్యోగుల కుట్ర – కార్మికుల్ని రోడ్డున పడేసి తాము పదవులు పొందాలనుకుంటున్నారా ?

స్టీల్ ప్లాంట్ ను రాజకీయ ముడి సరుకుగా చేసుకుని తమ రాజకీయ భవిష్యత్ ను ఎదిగిపోయేలా చేసుకుందామని ఆశపడే వారి సంఖ్య అంతకంతూ పెరుగుతోంది. ఏ పార్టీలోనూ చోటు దక్కని జేడీ లక్ష్మినారాయణ ఈ విషయంలో తన చేతనైనంతగా ప్రయత్నం చేస్తున్నారు. చివరికి కేఏ పాల్ తోనూ కలిసిపోయారు. ఆయనేమో తాను అమెరికా నుంచి డబ్బులు తెచ్చి స్టీల్ ప్లాంట్ ను కొనేస్తానని అసువుగా ప్రకటించేశారు. పక్కన ఉన్న జేడీ లక్ష్మినారాయణ కూడా కే ఏ పాల్ అద్భుతమైన స్టేట్ మెంట్ ఇచ్చారని మురిసిపోయారు. కానీ వారిని చూసే జనాలకు మాత్రం కాస్తంత నవ్వు.. బోలెడంత ఏవగింపు వస్తుంది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటానని జేడీ అతకని రాజకీయం

ఇప్పటికి దాదాపుగా మూడేళ్లు అయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతున్నారని రాజకీయం ప్రారంభించింది. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమెటెడ్ చేతుల్లోనే ఉంది. ఈ సంస్థను బలోపేతం చేయడానికి కేంద్రం ఆర్థిక మద్దతు ఇస్తూనే ఉంది. కానీ మూడేళ్ల నుంచి ఇదిగో ప్రైవేటీకరణ అంటూ రాజకీయం చేయని వారే లేరు. ఏ పార్టీలో లేని జేడీ లక్ష్మినారాయణ అతి అయితే మరీ ఎక్కువగా ఉంది. బిడ్ వేస్తామని కేసీఆర్ చెప్పగానే ఆయనను పొగిడేశారు. తీరా ఆయన బిడ్ కూడా వేయకపోతూండే సరికి నోట మాట రావడం లేదు. ఇప్పుడు కే ఏ పాల్ తో కలిసి పోరాటం చేస్తామంటున్నారు.

స్టీల్ ప్లాంట్ తో రాజకీయం కార్మికుల్ని మోసం చేయడమే !

స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు. స్టీల్ ప్లాంట్ భవిష్యత్ అద్భుతంగా ఉండి.. అందులో ఉన్న కార్మికులు, ఉద్యోగుల జీవితాలను కాపాడటానికే కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి కార్మికులు .. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో ఏపీలో అడుగు పెట్టాలనుకుంటున్న బీఆర్ఎస్ .. తెలంగాణలో ఒక్క పరిశ్రమనూ ప్రారంభింపచేయలేదు. అడ్డగోలుగా హామీలిచ్చిన వాటినీ మర్చిపోయారు. ఆ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులకూ అదే గతి పట్టించేందుకు బయలుదేరారు. ఇలాంటి వారు తమ రాజకీయ భవిష్యత్ కోసం స్టీల్ ప్లాంట్ ను మూసి వేయించడానికి కూడా వెనుకాడని స్థితికి వెళ్లిపోతున్నారు.

కార్మికులు, ఉద్యోగులకు నిజం తెలుసు !

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందంటూ ఉద్యమం చేస్తున్న కార్మికులకు.. ఉద్యోగులకు నిజం తెలుసు. ఎవరూ ఉద్యమమంలో పాల్గొనడం లేదు. ప్రైవేటీకరణ పేరుతో ఉద్యమం చేస్తున్న వారంతా కొన్ని రాజకీయ పార్టీల సానుభూతిపరులు మాత్రమే. వారి ట్రాప్‌లో పడి కొంత మంది విధులు ఎగ్గొట్టి ఉద్యమాలు చేస్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ భవిష్యత్ ను కాపాడుకోవాలన్నా..తమ కుటుంబాలు పచ్చగా ఉండాలన్నా స్టీల్ ప్లాంట్ మనుగడ కీలకం. అందు కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఉపయోగపడతాయని వారికీ తెలుసు. అయినా ప్రైవేటీకరణ అనేదాన్ని భూతంగా చూపించి రాజకీయం చేస్తున్నారు. చివరికి స్టీల్ ప్లాంట్ కు ఎలాంటి మేలు జరగకుండా.. అది మూసివేసేలా చేయడానికి కూడా ఈ రాజకీయ నేతలు వెనుకాడని పరిస్థితి వచ్చేస్తోంది. గుర్తించాల్సింది.. కార్మికులు.. ఉద్యోగులే !