పాతిక మంది ప్యారాచూట్ లీడర్లకు కాంగ్రెస్ టిక్కెట్లు – అంతా బీఆర్ఎస్ తో కలిసి వేసిన ప్లానే !?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల పేరుతో వలస నేతలకు పెద్ద పీట వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి భారీగా టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్ రెండో జాబితాలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, తాండూరు, మహబూబ్ నగర్, మునుగోడు, భువనగిరి, పరకాల టిక్కెట్లు కేటాయించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదయం కాంగ్రెస్‌లో చేరితే సాయంత్రానికి మునుగోడు టిక్కెట్ ఇచ్చారు.

మొత్తం మీద పాతిక మంది వరకూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు

మొదటి జాబితాలోనూ ఫిరాయింపు దార్లకు అవకాశం కల్పించారు. మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి, జహీరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు లాంటి ఫిరాయింపు దారులకు మొదటి జాబితాలో చోటు దక్కింది. కాంగ్రె్స పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్‌లో చేరిన భువనగిరి నేత కంభం అనిల్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఆఫర్ చేసి మరీ పార్టీలోకి తెచ్చుకున్నారు. వీరిలో అత్యధికులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే.

ఎన్నికల ఫలితాల తర్వాత ఫిరాయింపులకు ప్లాన్

గతంలో చాలా మంది కాంగ్రెస్ నేతలే. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఇప్పుడు అవకాశం కోసం వస్తే.. అంతకు మించి లీడర్లు లేరన్నట్లుగా కాంగ్రెస్ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికి పాతిక సీట్ల వరకూ వలస నేతలకు అవకాశం కల్పించారు. ఇంకా పందొమ్మిది సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. నాలుగు కమ్యూనిస్టులకు ఇచ్చిన మిగిలిన వాటిల్లో ఐదు చోట్ల వలస నేతలకే చాన్సివ్వబోతున్నట్లుగా తెలుస్తోది. వరందర్ని బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ లోకి పంపుతుందనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి గతంలో రెండుసార్లు జరిగిన సీఎల్పీ విలీనాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

హంగ్ వస్తే ఏం జరుగుతుంది ?

తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కొంత బలమైన నేతల్ని.. కాంగ్రెస్ లోకి పంపి.. ఆర్థిక సాయం చేసి అక్కడ గెలవగానే.. బీఆర్ఎస్ లోకి ఫిరాయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకే ఆయా అభ్యర్థులకు బీఆర్ఎస్ నుంచి ధన సాయం అందుతోందని చెబుతున్నారు. బీజేపీని కట్టడి చేసేందుకు ఇలా అభ్యర్థులను కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకున్న వైనం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.