కాంగ్రెస్, ఎస్పీ, మధ్యప్రదేశ్ పంచాయతీ

కాంగ్రెస్ పార్టీ అందరినీ దగ్గరకు తీసుకున్నట్లే కనిపిస్తుంది. అవకాశం వస్తే నమ్మి వచ్చిన వారినే మింగేసి తాను బలోపేతం కావాలనుకుంటుంది. ఇతరుల నుంచి తాను సాయం పొందడం మినహా.. తాను వేరే వారికి సాయం చేసే ప్రసక్తేలేదని అనేక పర్యాయాలు నిరూపించింది. ఇప్పుడు ఇండియా గ్రూపు ప్రారంభించిన తర్వాత కూడా ఇతరుల బలంపై తాను గెలివాలన్న తపన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది..

ఎస్పీ చెప్పిందొక్కటీ కమలనాథ్ చెబుతున్నదొక్కటీ…

ఇండియా గ్రూపులో ఉన్నందు వల్ల చివరగా కాంగ్రెస్ తో మధ్యప్రదేశ్లో ఎన్నికల పొత్తు ఉంటుదని పొరుగున ఉన్న ఉత్తర ప్రదేశ్లో పార్టీ సమాజ్ వాదీ నేత అఖిలేష్ యాదవ్ ఎదురుచూశారు. మధ్యలో చర్చలు కూడా జరిగాయి. పొత్తు దిశగా అడుగులు వేస్తున్నామని, సర్దుబాటు జరిగినట్లేనని సమాజ్ వాదీ నేతలు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కమల్ నాథ్ మాత్రం అడ్డం తిరిగారు. ఇండియా గ్రూపు ఏర్పాటైందీ కేవలం జాతీయ రాజకీయాలకు మాత్రమేనని అదీ అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదని ఆయన ప్రకటించారు. ప్రాంతీయ అంశాల ఆధారంగానే సమాజ్ వాదీ పార్టీతో పొత్తు విషయం చర్చిస్తామన్నారు. ప్రాంతీయంగా బీజేపీని ఓడించేందుకు ఎస్పీతో పొత్తు అనివార్యమని చెబుతూనే.. ఆ పార్టీకి సీట్లు కేటాయించలేమని కమల్ నాథ్ ప్రకటించడం ద్వంద్వ నీతికి నిదర్శనమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఏకపక్షంగా అభ్యర్థుల ప్రకటన..

పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని సమాజ్ వాదీ ప్రకటించిన నేపథ్యంలోనే ఇరు పార్టీలు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేశాయి. కాంగ్రెస్ ఇప్పటికే 144 స్థానాల్లో అభ్యర్తులను ప్రకటించింది. మిగతా 86 స్థానాలకు కూడా త్వరలోనే ప్రకటిస్తామంటోంది. ఎస్పీ ఇప్పటికే తాను గెలిచే అవకాశం ఉన్న 9 స్థానాల్లో కేండెట్స్ ను దించేసింది. మొత్తం 230 స్థానాల్లో పోటీ చేస్తామని ఎస్పీ మధ్యప్రదేశ్ నేత యష్ భారతీయ ప్రకటించారు. మరో పక్క కొందరు కాంగ్రెస్ అభ్యర్థులను ఎస్పీ టికెట్ పై పోటీ చేయించాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఆ నిర్ణయానికి అఖిలేష్ ఎందుకు ఒప్పుకుంటారన్నదే పెద్ద ప్రశ్న.

కేంద్ర నాయకత్వంతో తేల్చుకుంటాం…

సమాజ్ వాదీ పార్టీ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కు దిగింది. కమల్ నాథ్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ నాయకత్వంతో మాట్లాడుకుని పొత్తుపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు ఎస్పీ నేత శివపాల్ యాదవ్ ప్రకటించారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్,ఎస్పీ ఒకరిపై ఒకరు అసత్య ప్రచారాలు చేసుకోకూడదని ఆయన అన్నారు. ఆ పరిస్థితిని సృష్టించుకునే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల పొత్తు అనివార్యమన్నారు. మరో పక్క ఇండియా గ్రూపులో భాగమైన ఆప్ కూడా 39 నియోజకవర్గాల్లో అభ్యర్థును నిలబెట్టింది. వీటన్నింటికీ ఖర్గే, రాహుల్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.