రాహుల్ కోసం కాంగ్రెస్ రాష్ట్ర శాఖలను త్యాగం

కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీ. వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. ఏదో విధంగా ఆ కుటుంబాన్ని అధికార పీఠంపై కూర్చోబెట్టాలన్న తపన మినహా ఆ పార్టీలో వేరే ఆలోచనే ఉండదు. త్యాగాలు చేసిన కుటుంబం అని చెప్పుకుంటూ పార్టీలోని ఇతరులను త్యాగం చేయించడం ఆ కుటుంబానికి రివాజుగా మారింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

ఆప్ తో దోస్తీ కోసం…

ఢిల్లీలో అధికారం చెలాయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీతో స్నేహం కోసం ఇప్పుడు తమ రాష్ట్ర శాఖ మనోభావాలను కూడా కాంగ్రెస్ అధిష్టానం త్యాగం చేస్తోంది. కేంద్రంలో రాహుల్ ను పీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు ఆప్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు వెనుకాడటం లేదు. ఆప్ తో చేతులు కలిపితే ఢిల్లీలో దెబ్బతింటామని పార్టీ రాష్ట్ర శాఖ కోడై కూస్తున్నప్పటికీ పట్టించుకోకుండా.. ముందుకు సాగుతోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో బెట్టు చేసినట్లు నటిస్తూ చివరకు సరెండర్ అయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీని మంచి చేసుకుంటే,ఆయనతో చేతులు కలిపేందుకు సిద్ధమైతే వారి మద్దతు సులభంగా లభిస్తుందన్న చర్చ ఊపందుకుంటోంది. ఆప్ తో భవిష్యత్తు పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ సమాఖ్య స్ఫూర్తికే తూట్లు పొడుస్తోందని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఆరోపిస్తున్నారు..కార్యకర్తలు వద్దంటున్న స్నేహాన్ని అధిష్టానం ఎలా ముందుకు తీసుకెళ్తుందని బీజేపీ వేస్తున్న ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పే పరిస్థితి లేదు.

బెంగాల్ లో అథిర్ అరణ్య రోదన

కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అయిన బెంగాల్ ఎంపీ అథిర్ రంజన్ చౌదరి మాటలను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. మమతతో చేతులు కలిపితే ఆమె తమ పార్టీని మింగేస్తారని అథిర్ మొత్తుకున్నా పట్టించుకోకుండా ఖర్గే టీమ్ ముందుకు సాగుతోంది.జాతీయ స్థాయిలో విపక్ష కూటమి దిశగా అడుగులు వేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేస్తున్నా అధిష్టానం వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అక్కడి రాష్ట్ర శాఖలో అసంతృప్తికి కారణమవుతోంది.

ఇబ్బందుల్లో పంజాబ్ కాంగ్రెస్

ఆప్ తో స్నేహం కారణంగా ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పడం లేదు. అక్కడ భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులను అన్ని రకాలుగా ఒత్తి పెట్టే చర్యలు చేపడుతున్నారని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. కింది స్థాయిలో కేడర్ పై దాడులు జరుగుతున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయినా ఇప్పుడు మాత్రం ఆప్ తానా అంటే కాంగ్రెస్ తందానా అనే పరిస్థితి కనిపిస్తోంది. అవినీతి కేసులంటూ పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీని అరెస్టు చేసినా కూడా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు. అదీ హస్తం పార్టీ పరిస్థితి.