కాంగ్రెస్ నాయకత్వానికి ఓకే.. లేదు..లేదు..మేము ఒప్పుకోం….

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించి ఉండొచ్చు. పార్టీ నేతల్లో జోష్ పెరిగి ఉండొచ్చు. ఇంకేముంది దేశాన్ని ఏలేద్దామని కొందరు కాంగ్రెస్ నేతలు కలలు కంటుండొచ్చు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీని బూచిగా చూపించి అందరినీ కలుపుకుపోయేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తుండొచ్చు. వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. కర్ణాటకలో డీఫాల్ట్ గా గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ ను ఇతర పార్టీలు నెత్తిన పెట్టుకుంటాయన్న నమ్మకం మాత్రం కలగడం లేదు. కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ తీరు పట్ల నమ్మకంగా లేరు.

బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడలేదంటున్న విజయన్

కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఒకటే అన్నట్టుగా ఒకప్పుడు వ్యవహరించేవారు. ఒకరికి దెబ్బ తగిలితే మరోకరు బాధతో మూలిగేవారు. ఇప్పుడు కాంగ్రెస్ బాగా బలహీనపడిన తర్వాత కమ్యూనిస్టులు కూడా హస్తం పార్టీని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అనే ఒక అదనపు లగేజీని మనం ఎందుకు మోయాలన్న ఫీలింగ్ వారిలో కనిపిస్తోంది. పైగా మాజీ మిత్రపక్షాలనే ముంచేసి పైకి రావాలన్న కోరిక కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. కేరళ సీఎం పినరయి విజయన్ స్వయంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపతున్నారు..

వాయినాడ్ పోటీ తర్వాత…

వాయినాడ్ లో రాహుల్ గాంధీ పోటీ చేయడం కమ్యూనిస్టులకు సుతారమూ నచ్చలేదు. దేశంలో ఎక్కడా చోటు లేనట్టుగా ఇక్కడేందుకని వాళ్లు ప్రశ్నించారు. మేమున్న చోటే నువ్వూ రావాలా రాహుల్ అని వాళ్లు ప్రశ్నించారు. అయితే అమేఠీలో ఓటమి ఖాయమని తెలుసుకున్న రాహుల్, వేరే మార్గంగా వాయినాడ్ బరిలోకి దిగారు. అమేఠీలో ఓడిపోయినా, వాయినాడ్ లో గెలిచి లోక్ సభలో కూర్చుంటున్నారు. ఇప్పుడదే కమ్యూనిస్టు, కాంగ్రెస్ మధ్య కలహానికి కారణమవుతోంది. తమ కంచుకోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని సీపీఎం భావిస్తోంది..

బీజేపీని ఓడించే సత్తా లేదు..

దేశంలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ బలహీనపడిపపోయిందని కేరళ సీఎం విజయన్ అంటున్నారు.ఆ పార్టీకి పూర్వ వైభవం రావడం కష్టమని చెప్పేశారు. బీజేపీతో తలపడేందుకు వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీలు సరికొత్త వ్యూహాలను అమలు జరుపుకోవాలని, అంతకు తప్పితే కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసే అవకాశం లేదని విజయన్ తేల్చేశారు. బలహీనమైన కాంగ్రెస్ మనకెందుకన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు.

సాజీ చెరియన్ ఆలోచన..
కేరళ మత్స్య శాఖామంత్రి సాజీ చెరియన్ మాత్రం మరో మాట చెబుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త ఫ్రంట్ ఏర్పాటు కావాలంటున్నారు. దేశంలోని శక్తిమంతమైన పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఒకటని చెరియన్ లెక్కలు కట్టారు. కాంగ్రెస్ శక్తి సామర్థ్యాలపై చర్చ కూడా అవసరం లేదని చెరియన్ చెబుతున్నారు కాకపోతే కేరళ సీపీఎంలో విజయన్ మాటే నెగ్గుతుందని అందరికీ తెలుసు.అందుకే చెరియన్ వాదనను ఎవరూ పట్టించుకోరు.