లౌకిక ముసుగులో కాంగ్రెస్ ఓట్లు దండుకోవడం కొత్తేమీ కాదు. కులాలు, మతాలను రెచ్చగొట్టే ఆ రాజకీయ సంస్థ చేష్టలు చెప్పనలవి కాదు. ఇంటా, బయట ఎక్కడున్నా కాంగ్రెస్ నేతలు విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలోనూ అదే జరిగింది. కాంగ్రెస్ ను అందరి పార్టీగా చిత్రీకరించేందుకు రాహుల్ చేసిన ప్రయత్నాన్ని బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది.
ఐయూఎంఎల్ సెక్యులర్ పార్టీ – రాహుల్
కేరళలో కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పొత్తు పార్టీలు .అదే విషయాన్ని రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన సందర్భంగా మీడియాతో ప్రస్తావించారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు మత కలహాలు చెలరేగకుండా ఐయూఎంఎల్ ప్రజల్లో సద్భావనను ప్రచారం చేసిందని రాహుల్ అన్నారు. ఐయూఎంఎల్ అధినేత సయ్యద్ మొహ్మద్ అలీ చొరవతోనే కేరళలో ఎలాంటి హింసాకాండ జరగలేదన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే సంస్థల నుంచి ముస్లింలను కాపాడి వారిలో ఐయూఎంఎల్ చైతన్యం తీసుకొస్తోందని కూడా రాహుల్ కితాబిచ్చారు. దేశంలో సెక్యులర్ ముస్లిం పార్టీ ఏదైనా ఉందంటే అది ఐయూఎంఎల్ మాత్రమేనని రాహుల్ తేల్చేశారు.
దేశ విభజనకు కారణమైన పార్టీ – మాలవీయ
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశ విభజనకు కారణమైన పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. దేశ చరిత్ర రాహుల్ కు తెలియదని, హిందువుల పడిన కష్టాలు ఆయన దృష్టికి రాలేదని బీజేపీ నేతలు అంటున్నారు. కేవలం రాజకీయ మనుగడ కోసమే కాంగ్రెస్ పార్టీ ఐయూఎంఎల్ ను నెత్తిన పెట్టుకుని మోస్తుందని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వెదుక్కునే క్రమంలో ముస్లిం లీగ్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు..
సీపీఎం కూడా వ్యతిరేకమే…
నిజానికి జిన్నా ప్రారంభించిన ముస్లిం లీగ్ ను స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లోనే రద్దు చేశారు.దాని నుంచి కేరళలో పుట్టినదే ఐయూఎంఎల్. చాలా కాలంగా కేరళ యూడీఎఫ్ లో భాగస్వామి. ప్రస్తుతం ఆ పార్టీకి నలుగురు లోక్ సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడున్నారు. వాయినాడ్ లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ఆ పార్టీ మద్దతిచ్చింది. ఆ పార్టీ ఎప్పుడూ కాంగ్రెస్ కు మిత్రపక్షమే. కేరళ అధికార వామపక్ష కూటమికి నాయకత్వం వహించే సీపీఎం కూడా ముస్లిం లీగ్ ను వ్యతిరేకిస్తుంది. సైద్దాంతిక పరంగా మాత్రమే కాకుండా.. ప్రజల్లో విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్న పార్టీగా కూడా ఐయూఎంఎల్ ను సీపీఎం దూరంగా ఉంచుతోంది.
కేరళలో బీజేపీ రైజింగ్ పార్టీగా ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కేరళ నుంచి ఈ సారి ప్రాతినిధ్యం ఉంటుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అటువంటి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఐయూఎంఎల్ సహకారాన్ని ఆశిస్తోంది. ఆ దిశగా ఓ కార్యాచరణ కూడా రూపొందినట్లు చెబుతున్నారు. వాయినాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఆ కార్యాచరణ రూపకల్పనలో కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. అందుకే అవసరం ఉన్నా, లేకపోయినా ముస్లిం లీగ్ ను ఆయన పనిగట్టుకుని పొగుడుతున్నారని బీజేపీ నేతలంటున్నారు.వచ్చే ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ అవకాశం వస్తే వాయినాడ్ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. అందుకోసమే కాంగ్రెస్ నేతలు ముస్లిం లీగ్ ను మోస్తున్నారని బీజేపీ భావిస్తోంది.