ఇండియా గ్రూపుకు కాంగ్రెస్ దాసోహం

దేశంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఏదో విధంగా మనుగడ సాగించాలన్న తపనతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఎంతటి రాజీకైనా దిగుతోంది. మీతో బంధం వద్దు బాబూ అని మిత్రపక్షాలుగా చెప్పుకుంటున్న వాళ్లు దూరం జరుగుతున్నా..లేదు లేదు.. మమ్మల్ని కలుపుకుపోండంటూ బతిమాలుతోంది. మమతాగ్రహం, నితీశ్ సన్నాయి నొక్కుళ్లు ఈ దిశగా సంకేతాలిస్తున్నాయి….

కాంగ్రెస్ కు దూరం జరిగిన మమత

బెంగాల్‌లో కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
సీట్ల పంపకాలపై కాంగ్రెస్ కు తాను చేసిన ప్రతిపాదనలను తిరస్కరించినందుకే దూరం జరిగామని ఆమె అంటున్నారు.ఇకపై బెంగాల్ లో కాంగ్రెస్ తో ఎటువంటి సంబంధమూ ఉండదని కూడా ఆమె తేల్చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 300 స్థానాల్లో పోటీ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని అయితే బెంగాల్ రాష్ట్రంలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదని ప్రకటించారు. మరో పక్క ఒంటరిగా వెళ్లాలని తమ నాయకురాలు నిర్ణయించటానికి కాంగ్రెస్‌ వైఖరే కారణమని తృణమూల్‌ నేతలు తెలిపారు. ఇండియా కూటమి ఏర్పాటైన కొత్తలో బీజేపీకి వ్యతిరేకంగా ముఖాముఖి పోటీ జరిగేలా చూద్దామని అందరం భావించామని, కానీ కాంగ్రెస్‌ ఆ ఫార్ములాను పాటించటం లేదని చెప్పారు. తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లను పంచుకోవటానికి కాంగ్రెస్‌ ఇష్టపడటం లేదని, ప్రాంతీయపార్టీలు బలంగా ఉండి తమ ఉనికి నామమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం సీట్ల కోసం పట్టుబడుతోందని విమర్శించారు. డిసెంబరు నెలాఖరులోపు సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుందామని మమత చెప్పినప్పటికీ కాంగ్రెస్‌ తీవ్ర జాప్యం చేసిందని, చర్చలు ఫలించి ఉంటే ఒకటి రెండు సీట్లు అదనంగా ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డామని తెలిపారు.

ఎన్డీయే వైపు నితీశ్ చూపు..

కాంగ్రెస్ వైఖరితో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా విసిగిపోయారు. సోషలిస్టు నేత కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న వచ్చిన సందర్భంగా ఆయన కామెంట్స్ ఈ దిశగా సంకేతాలిస్తున్నాయి. అత్యంత వెనుకబడిన వర్గాలకు సేవచేసిన కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎన్నడూ సుముఖత వ్యక్తం చేయలేదని,ఇప్పుడు బీజేపీ మాత్రమే ఆ పని చేసిందని ఆయన ప్రశంసించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నితీశ్ ను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు..

ఆమె లేకపోతే మేము లేము – కాంగ్రెస్

మమత వద్దుపోమ్మని ఛీకొట్టినా కాంగ్రెస్ పార్టీ దేబురిస్తూ నిలబడుతోంది. మమత లేకుండా ఇండియా కూటమిని ఊహించలేమని పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి పోటీ చేస్తుందని, భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొంటాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చెప్పారు. అనిశ్చితికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నిజానికి ప్రస్తుత వివాదం సీట్ల పంచాయతీ అని కూడా చెప్పుకోవచ్చు. బెంగాల్లో 42 లోక్ సభా స్థానాలుంటే కాంగ్రెస్ కు రెండుకు మించి ఇవ్వలేమని మమత ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం 10 నుంచి 12 సీట్లు అడుగుతోంది. రాష్ట్రంలో బలం లేని కాంగ్రెస్ కు అన్నిసీట్లు ఇవ్వడం ఇష్టం లేక ఆ పార్టీని వదిలించుకునేందుకు మమత నిర్ణయించుకున్నారు.పైగా రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించిన సమాచారాన్ని మమతకు ఇవ్వలేదన్న అక్కసు ఆమెకు ఉంది..