ఉత్తర దక్షిణ విభేదాలు సృష్టిస్తున్న కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తలబొప్పికట్టిపోయి, కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. ఓటమిని గౌరవంగా అంగీకరించాల్సిన పార్టీ ఇప్పుడు సాకులు వెదుకుతూ కొత్త వివాదాలను సృష్టించే ప్రయత్నంలో ఉంది. రాజకీయాల్లో కూడా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాల్సిన పార్టీ ఉత్తరం, దక్షిణం విభేదాలను సృష్టిస్తోంది. దేశంలోని రెండు ప్రాంతాలను విడదీసేందుకు ప్రయత్నిస్తోంది.

ఉత్తరాదిలో మతవాదం, నిరక్షరాస్యత అంటూ ప్రచారం

దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎన్నికల్లో సహేతుకమైన నిర్ణయాలు తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఎన్నుకోవడానికి మత మౌఢ్యం, నిరక్షరాస్యతే కారణమని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని, మూడు హిందీ బెల్టు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపును పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. దక్షిణాది పురోగమిస్తోందని, ఉత్తరాది మతవాదంతో కొట్టుమిట్టాడుతోందని కొందరు కాంగ్రెస్ వ్యూహకర్తలు ఆరోపణలు సంధిస్తున్నారు.

ఉత్తరాది గెలుపును మరిచిపోయిన కాంగ్రెస్ ..

కాంగ్రెస్ పార్టీ త్వరగా గతాన్ని మరిచిపోతుంది. మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ 2018లో అత్యధిక స్థానాలు సాధించి కమల్ నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి అక్కడ మతవాదం, వెనుకబాటుతనం ఉంటే కాంగ్రెస్ ఎలా గెలిచిందనేదే పెద్ద ప్రశ్న. అందుకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ తప్పించుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తాము గెలిచామని కూడా కాంగ్రెస్ నేతలు మరిచిపోయారు. పైగా ఇంతకాలం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో తాము అధికారంలో ఉన్న సంగతి కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తులేనట్లుగా ఉంది.

దక్షిణాదిలోనూ బీజేపీ జయభేరీ..

బీజేపీకి దక్షిణాదిలో బలం లేదనడం కాంగ్రెస్ పార్టీ అవివేకమే అవుతుంది. కర్ణాటకలో ఇప్పుడు అధికారాన్ని కోల్పోయినా 2019 లోక్ సభ ఎన్నికల్లో అక్కడి 28 స్థానాల్లో 25 బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది చోట్ల గెలిచి తన ఓటు షేర్ ను రెట్టింపు కంటే ఎక్కువ చేసుకుంది. తమిళనాడులో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై నేతృత్వంలో పార్టీ దూసుకుపోతోంది. సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు బీజేపీ గట్టిగా సమాధానమిచ్చింది. సనాతన ధర్మం మనదేశానికి ఎందుకు అవసరమో అర్థమయ్యేట్లుగా వివరించింది. నిజానికి మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి స్వయంకృతమే అవుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం, నేతల అవినీతితో ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైంది. రాజస్థాన్లో అంతర్గత కీచులాటతో ఓడిపోయింది. మధ్యప్రదేశ్లో మోదీ కరిష్మా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ పాలన ముందు కాంగ్రెస్ గెలవలేకపోయింది. గెలవాల్సిన చోట ఓడిపోయి ఇప్పుడు కొత్త ఆరోపణలకు దిగుతున్నది. కాంగ్రెస్ ఓటమికి ఉత్తరాది, దక్షిణాది లెక్కలకు సంబంధం ఏమిటో ఖచితంగా చెబితే బావుంటుంది కల్లబొల్లి కబుర్లతో ఓటమి భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే మాత్రం పొరబాటే అవుతుంది….