ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వ ఖజానాను దోచుకునే క్రమంలో బీజీగా ఉందని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రోజుకో అవినీతి బయట పడుతూనే ఉంది. సీఎం అశోక్ గెహ్లాట్ కేబినెట్లో మంత్రులు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చీమకుట్టినట్లుగా కూడా లేదని చెప్పాలి…
మంత్రిపై ఈడీ రెయిడ్
రాజస్థాన్ హోం శాఖ సహాయ మంత్రి రాజేంద్ర యాదవ్ నివాసాలు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వెళ్లిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అవినీతి ఆరోపణలు రావడంతో జైపూర్ సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు. మంత్రి రాజేంద్ర యాదవ్ ఆయన కుమారుడికి సంబంధించిన రాజస్థాన్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ కంపెనీలో సోదాలు జరిగాయి. మధ్యాహ్న భోజన పథకంలో మంత్రి ఆయన బంధువులు సొమ్ములు బొక్కేశారన్న ఆరోపణలు రావడంతో మంగళవారం జరిగిన ఈడీ దాడుల్లో అనేక కీలక దస్తావేజులు స్వాధీనమయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ కూడా సోదాలు నిర్వహించి ఐటీ రిటర్న్స్ లో అవకతవకలు జరిగాయని నిగ్గు తేల్చింది. రాజేంద్ర యాదవ్ రెండో సారి ఎమ్మెల్యేగానూ, మొదటిసారి మంత్రిగానూ పనిచేస్తున్నారు..
ఐటీ శాఖలో రూ.5,000 కోట్ల స్కామ్
రాజస్థాన్ ఐటీ శాఖలో రూ. 5 వేల కోట్ల అవినీతి జరిగినట్లు బీజేపీ సహా రాష్ట్ర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గెహ్లాట్ కు అత్యంత సన్నిహితుడైన ఐటీ అధికారి రాజేష్ శైనీ ఈ స్కాముకు ఆద్యుడని చెబుతున్నారు. పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్స్, వేర్వేరు శాఖలు – కార్యాలయాల్లో వైఫై ఏర్పాటుకు సంబంధించి స్కామ్ జరిగిందన్న ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అధికారుల పర్యటనల్లో లెక్కకు మించి ఖర్చు చూపారని తేలింది. పరికరాల కొనుగోలులో రేట్లు భారీగా పెంచేశారు. రాష్ట్రంలో తిరిగేందుకు అధికారులకు రూ.2 లక్షలు, రాష్ట్రం బయట పర్యటనలకు రోజుకు రూ.4 లక్షలు అలవెన్స్ చెల్లించారు. ఇంత ఖర్చు ఎక్కడా లేదని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి.దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కుమారుడు వైభవ్ గెహ్లాట్ , మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జైపూర్లోని అమెర్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది.
సహకార సంఘాల్లో భారీ అవినీతి
సహకార సంఘాలు, ముఖ్యంగా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ లో భారీగా స్కాములు జరుగుతున్నాయి. జనం దాచుకున్న డబ్బులు రూలింగ్ పార్టీ అండదండలతో అధికారులు, డైరెక్టర్లు మింగేస్తున్నారు. రూ. 10 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. సంజీవనీ క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో ఎక్కువ స్కామ్ జరిగినట్లు తేల్చారు. బాధితులు వెళ్లి ముఖ్యమంత్రి గెహ్లాట్ కు ఫిర్యాదు చేసినప్పటికీ చూస్తే, చేస్తాం అనడం తప్ప ప్రత్యేకంగా సాయపడినదీ లేదు.