కదిరి వైసీపీలో గందరగోళం – సిట్టింగ్‌కు సీట్లు గల్లంతయినట్లేనా ?

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు గండం కనిపిస్తోంది. కదిరి నియోజవకర్గం వైసిపికి కంచుకోటనే చెప్పాలి. వైసిపి పోటీ చేసిన రెండు పర్యాయాలు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇలాంటి పరిస్థితుల్లో కదిరి వైసిపి టికెట్టు తెచ్చుకునేందుకు ఆ పార్టీలో పెద్ద ఎత్తున నేతలు ఉత్సాహం కనబరుస్తున్నారు. వైసిపి బీఫామ్‌తో పోటీ చేస్తే గెలుపు తమదే అన్న ధీమాతోనే నేతలు ఉన్నారు. అధిష్టానం మాత్రం అభ్యర్థి ఏవరన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన సంకేతాలు ఏవీ ఇవ్వడం లేదు. నేతలు మాత్రం ఎవరికి వారు తామే అభ్యర్థులం అంటూ వారి అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు.

ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై అసంతృప్తిలో క్యాడర్

ఎమ్మెల్యే పనితీరుపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సాయం చేయలేదన్న అపవాదు ఎదుర్కొంటున్నారు. అందుకే హైకమాండ్ కూడా కొత్త పేర్లను పరిశీలనలోకి తెస్తోంది. వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి పని చేసిన కొంత మంది నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ బాగుపడలేకపోయారు. వారంతా జెండాను మోసి గ్రామాల్లోకి పార్టీని తీసుకెళ్లారు. ఇలాంటి చాలా మంది నేతలు ప్రస్తుతం అధిష్టానం గుర్తింపు లేక సాధారణ నాయకుల మాదిరే ఉండిపోతున్నారు. ఆర్థిక బలం ఉన్న వారికే పార్టీలో గుర్తింపు లభిస్తోందని కొందరు నాయకులు వాపోతున్నారు. పనులు కూడా పెద్దగా దక్కకపోవడంతో… వారిలో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది.

వైసీపీ నేతల మధ్య కనిపించని సయోధ్య

ఎమ్మెల్యే పివి.సిద్ధారెడ్డి పార్టీని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే , మాజీ సమన్వయకర్త ఎస్‌ఎండి ఇస్మాయిల్‌, సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసులు, వాల్మీకి అధినేత, నియోజకవర్గ వైసిపి నాయకులు పవన్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్‌లు పార్టీ కోసం శ్రమిస్తున్నారు. కరోనా, వరదల సమయంలో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేపట్టారు. సిద్దారెడ్డికి మరోసారి చాన్సివ్వరని. .. తమలో ఎవరికి జగన్ చాన్సిచ్చినా కలిసి పని చేయాలనుకుంటున్నారు.

కొత్త పేర్లను తెరపైకితెస్తున్న హైకమాండ్

అయితే వైసీపీ హైకమాండ్ కులం సమీకరణలను ముందుకు తెస్తోంది. కదిరిలో అత్యధికంగా ఉండే ఓ సామాజిక వర్గం నాయకున్ని తెరపైకి తేవాలనే ప్రచారం ఇటీవల ఆ పార్టీలో ఎక్కవగా కన్పిస్తోంది. దీనిని అదే సామాజిక వర్గం నేతలు కూడా వ్యతిరేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చినంత మాత్రానా వారికి కోసం పని చేస్తామా అంటూ ఆ సామాజిక వర్గం నాయకులే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అయితే ఆర్థిక బలం ముఖ్యమన్న కారణంగా… వైసీపీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుదో ఎవరికీ అంతు చిక్కడం లేదు.