తమిళనాడులో డీఎంకే నేతలు చెప్పేదీ శ్రీరంగ నీతులు, దూరేది ఎక్కడో ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయీ…మాకు మాత్రం అవన్నీ వర్తించవన్నట్లుగా వాళ్లు ప్రవర్తిస్తుంటారు. ఆత్మగౌరవం, సమసమాజం,అవినీతికి దూరం అంటూ సూక్తులు చెప్పే డీఎంకే నేతలు…లక్షణరేఖ దాటడంలో మాత్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంటున్నారు. డీఎంకేకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా తీరు చూస్తే వాళ్ల అసలు రంగు బయటపడుతుంది..
రాజా ఆస్తుల జప్తు
ఎ.రాజా ప్రస్తుతం డీఎంకే ఎంపీగా ఉన్నారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా ఉన్నారు. డీఎంకే ఎంపీ ఎ. రాజా బినామీ సంస్థకు చెందిన 15 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. చట్ట వ్యతిరేక నగదు బట్వాడా నిరోధక చట్టం ప్రకారం రాజాపై నమోదైన అక్రమార్జన కేసుల విచారణలో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. కోయంబత్తూరులో ఉన్న ఎంపీ రాజా బినామీ సంస్థగా కోవై షెల్టెర్స్ ప్రమోటర్స్ ఇండియా ఆస్తులను జప్తు చేసినట్టు వివరించారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
గురుగ్రామ్ కంపెనీతో క్విడ్ ప్రోకో
2004-2007 మధ్య కేంద్ర పర్యావరణ శాఖామంత్రిగా ఉన్న రాజా.. గురుగ్రామ్ కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి పర్యావరణ అనుమతిచ్చారు. ఆ సంస్థ బ్లాక్ మనీ రూపంలో రాజాకు ముడుపులిచ్చింది. ఆ సొమ్మును వైట్ మనీగా మార్చుకునేందుకు కోవై షెల్టెర్స్ ప్రమోటర్స్ ఇండియా అనే సంస్థను స్థాపించారు. డబ్బులను ఆ సంస్థలోకి పెట్టుబడులుగా పెట్టినట్లు ఈడీ గుర్తించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోవై షెల్టర్స్ సంస్థ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేయలేదు. వందల కోట్లలో ఆదాయం మాత్రం చూపిస్తోంది. అదో డొల్ల సూట్ కేస్ కంపెనీ అని ఈడీ విచారణలో వెల్లడి కావడంతో ఆస్తులను జప్తు చేయాల్సి వచ్చిందని అధికారిక ప్రకటన వెలువడింది.
2జీ స్కామ్ నిందితుడు…
ఎ.రాజా టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు 2జీ స్కామ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ సేవలకు అవసరమైన రెండో తరం స్పెక్ట్రం అనుమతులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు కాగ్ 2010లో నివేదిక ఇచ్చింది. ఎ, రాజా, డీబీ గ్రూప్ ప్రమోటర్ షాహిద్ బల్వాలను 2011 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన కేసులోనే డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళిని కూడా జైల్లో పెట్టారు. మరసటి సంవత్సరమే రాజా హయాంలో జారీ చేసిన 122 లైసెన్సులను రద్దు చేశారు. 2017 డిసెబంరులో మాత్రం రాజాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసులో అప్పీలుకు వెళ్లింది. కోర్టు నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ తాజా కేసులతో ఎ. రాజా అవినీతి బాగోతాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి.దీనికి డీఎంకే నేతల సమాధానం ఏమిటో..