కడప జిల్లా అంటే వైసీపీకి కంచుకోట. వైసీపీ అభ్యర్థులపై పెద్దగా చర్చల్లేవు. దాదాపుగా సిట్టింగ్‌లకే టిక్కెట్లు లభిస్తాయి. కానీ టీడీపీ టిక్కెట్ల కోసం ఈ సారి భారీ పోటీ ఏర్పడింది. జమ్మలమడుగు, పులివెంందుల మినహా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. వీటిలో కమలాపురం, మైదుకూరు నియోకవర్గాల అభ్యర్ధులపై స్పష్టత ఉన్నా ప్రకటించాల్సి ఉంది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండంతో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్నది అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
సర్వేలు చేయిస్తున్న టీడీపీ హైకమాండ్
లోకేష్ పాదయాత్ర తర్వాత జిల్లాలో తెలుగుదేశం పార్టీ సర్వే బృందాలు అభ్యర్థులపై అభిప్రాయసేకరణ చేస్తున్నాయి. ఈ సర్వే ఆధారంగా అధినేత చంద్రబాబుకు జిల్లాలో నాయకులపైన, జిల్లా పట్ల ఉన్న అభిప్రాయాలతో అభ్యర్థుల ఖరారకు తుదిరూపం ఇచ్చి దసరా నాటికి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలైన ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, రాజంపేట, ,రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్లకు పోటా పోటీ ఏర్పడింది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఆరు చోట్ల అభ్యర్థిత్వాలపై సరైన స్పష్టత కనిపించకపోవడంతో టిడిపి కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు. ఏ నాయకుడు వద్ద పని చేయాలో తెలియక గ్రూపు రాజకీయాలతో నలిగి పోవాల్సి వస్తోంది.
ఆరు చోట్ల అసంతృప్తులు ఖాయం
ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం టిడిపికి అంత సులువైన అంశం కాదు. అభ్యర్థిగా అవకాశం దక్కని వారు అసంతృప్తికి గురికావడం, పార్టీకి నష్టం కలిగించే అవకాశాలకు దారితీసే పరిస్థితి ఎదురు కావడం లాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆందోళన పార్టీలో కనిపిస్తోంది. కాగా రాజంపేటకు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు టికెట్ రేసులో ముందు వరుసలో ఉండగా రాయచోటి చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత జగన్మోహన్రాజు గట్టి ప్రయత్నంతో ఉన్నారు. టికెట్ పై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. రైల్వేకోడూరులో గత ఎన్నికల్లో పోటీ చేసిన పంతగాని ప్రసాదు ఆశావహుల్లో టిక్కెట్‌పై ఖచ్చితమైన ధీమాను వ్యక్తం చేస్తు న్నారు. ఇక్కడ ప్రధాన నాయకుడైన విశ్వనాథ నాయుడుకు ప్రసాద్‌కు సరైన సంబంధాలు కనిపించడం లేదు. ఇక్కడ నుండి మరో మహిళ అనితా దీప్తి టికెట్ రేసులో ఉన్నారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు.
ప్రొద్దుటూరులోనూ అదే పరిస్థితి
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టికెట్ తనకే అన్న ధీమాతో ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఉండగా టికెట్టుపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కూడా నమ్మకంతో ఉన్నారు. మరో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆశావహుల్లో ఉండగా ఇటీవల కొద్ది రోజులుగా సిఎం సురేష్‌నాయుడు పార్టీలో క్రియాశీలకంగా మారారు. నలుగురిలో ఎవరు అభ్యర్థి అవుతారు అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కడప అసెంబ్లీలోనూ ఎక్కువ మంది ఆశావహులున్నారు. అయినా ప్రధానంగా ఇద్దరు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీరిలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మిరెడ్డి కోడలు, కార్పొరేటర్ ఉమాదేవి, టిడిపి పొలి ట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవి లతలున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి అమీర్‌బాబు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ఎవరిని అభ్య ర్థిగా ఖరారు చేస్తారన్నది ఆ పార్టీలో ఉత్కంఠగా మారింది.
ఎస్సి రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గంమైన బద్వేలులో కూడా ఆశావహులసంఖ్య ఎక్కువగా ఉంది. వీరి లో గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఓబు లాపురం రాజశేఖర్ మొదటి వరుసలో ఉండగా ఇదే నియో జకవర్గంలోని పోరుమామిళ్ళకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి రోషన్ పేరు కూడా బాగా వినిపిస్తోంది.
మొత్తంగా ఈ సారి కడపలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ఎంత వరకూ సక్సెస్ అవుతారో మరి !