కేజ్రీవాల్ అక్రమాలపై కాగ్ కొరడా

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టిన ఆ పార్టీలోనే అవినీతి పెరిగిపోయింది. వందల కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ కేంద్ర బిందువైంది. మద్యం కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ రాక ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ లోపే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మరో స్కాం వివాదం వేడెక్కుతోంది. ఆప్ లో నీతి.. నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందనిపిస్తోంది.

ఇల్లు మరమ్మత్తులు, పునర్మిర్మాణంలో అవకతవకలు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసం పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. పరిపాలనా, ఆర్థిక పరమైన లొసుగులు బయట పడ్డాయి ఇంటి రినోవేషన్ కు ఢిల్లీ ప్రజా పనుల శాఖ తొలుత రూ.7.62 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. తర్వాత దాన్ని 15 నుంచి 20 కోట్లకు సవరించారు ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 33.20 కోట్లు మంజూరు చేశారు . ఎప్పటికప్పుడు ఆ మొత్తాన్ని పెంచుకుంటూ పోయి రూ.52,71,24,570 చెల్లించారని తెలిసింది. ఈ ఖర్చుతో పాటుగా బంగ్లాకు వేసిన కర్టెన్లు రూ.1.5 కోట్ల రూపాయలు పెట్టి కొన్నట్లు లెక్కలు రాశారు. కర్టెన్లకు కోటిన్నర ఖర్చవుతుందా అని సామాన్య ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

నిబంధనలకు పాతర

నిజానికి ఢిల్లీ సీఎం అధికారిక నివాసం విషయంలో అన్ని నిబంధనలను తుంగలో తొక్కారు. ఎలాంటి సర్వే రిపోర్టు లేకుండా పాత భవనంలో కొంత భాగాన్ని కూలగొట్టారు. కొత్త భవనానికి ప్లాన్ అప్రూవల్ లేకుండానే నిర్మాణాలు మొదలు పెట్టారు. పనులు ఆపు చేయించేందుకు పీడబ్ల్యూడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పైగా కరోనాతో ఆర్థిక వ్యవస్థ చితికిపోయినప్పుడే కేజ్రీవాల్ ఇంటికి రూ.50 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం వివాదమైంది.

కాగ్ విచారణకు ఎల్జీ సిఫారసు

కేజ్రీవాల్ నివాసంలో మరమ్మత్తుల పేరుతో మొత్తం కొత్త భవనాన్నే నిర్మించారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీనిపై అంతర్గతంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా .. కేంద్ర హోం శాఖకు ఒక లేఖ రాశారు. మొత్తం వ్యవహారంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేత విచారణ జరిపించాలని కోరారు. మే 24న ఎల్జీ రాసిన లేఖకు కేంద్ర హోం శాఖ ఇప్పుడు స్పందించింది. భవన నిర్మాణ అవకతవకలపై కాగ్ విచారణకు ఆదేశించింది. మరో పక్క చేసిన తప్పు కప్పిపుచ్చుకోలేక ఆప్ నానా తంటాలు పడుతోంది. ఆడలేక మద్దెలు ఔడు అన్నట్లుగా బీజేపీపై ఆరోపణలు సంధిస్తోంది. బీజేపీ నిరాశ, విరక్తి, నియంతృత్వవంలో ఉందంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. కాకపోతే నిజం ఢిల్లీ ప్రజలకు తెలుసు. జరిగిన అవినీతి వాళ్ల కళ్లెదుటే కనిపిస్తోంది.