ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ పడకపోతే రోజు మొదలవదు. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. కొందరైతే టీ కానీ కాఫీ కానీ తాగకపోతే తలనొప్పి, చికాకుగా ఫీలవుతారు. ఇంకా చెప్పాలంటే రోజుని ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు అదో మెడిసిన్ లా ఫీలవుతారు. ఇంతకీ టీ, కాఫీ రెండింటిలో పొద్దున్నే ఏం తాగితే మంచిది…
-టీ లో ఎల్ – థియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనలో ఫోకస్, అటెన్షన్, ఆలోచనా శక్తిని పెంచుతుంది.
-రెగ్యులర్ గా టీ తాగే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే టీ మీ పళ్లను పసుపు రంగులోకి మార్చుతుంది.
- ఆహారం తిన్న తర్వాత టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకునే శక్తి 62 శాతం మేర తగ్గుతుంది. కాఫీ తీసుకుంటే ఇది కేవలం 35 శాతం మేరకే ఉంటుంది.
- కాఫీ లో ఎక్కువగా ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే చాలామంది బ్లాక్ కాఫీని వర్కవుట్ ముందు ప్రీ వర్కవుట్ గా తీసుకుంటూ ఉంటారు.
- కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు కాఫీ దోహదపడుతుంది. అయితే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
- టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయి. దీనివల్ల ఎముకలు పెళుసుబారడం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
- రెండింటిలో కాఫీ కంటే టీ మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీలో కెఫీన్ స్థాయులు చాలా తక్కువగా ఉంటాయి. కప్పు బ్లాక్ టీ లో 14 నుంచి 70 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉండగా.. కప్పు కాఫీలో 95 నుంచి 200 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉంటుంది.
- టీ లేదా కాఫీని బాగా మరిగిస్తే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు చాలా తగ్గిపోతాయి. అందుకే వీలైనంత వరకు నీటిని వేడి చేసి అందులో టీ లేదా కాఫీ పొడి వేసి ఒక్కసారి కాస్త మరగగానే దింపేయడం మంచిది.
- టీ అయినా కాఫీ అయినా రోజులో రెండు కప్పులు మించకుండా చూసుకుంటే మంచిది. అంతకు మించి తీసుకున్నపుడు దాని వల్ల జరిగే మంచి కంటే చెడే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం