మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ఎందుకు ఉంటున్నారు. సీఎం అయితే.. ముఖ్యమంత్రి అనే పదవి అని ఆయన అనుకోరు. సీఎం అంటే కామన్ మెన్ కోసం పని చేస్తున్న వ్యవస్థగా అనుకుంటారు. అందులో తానో భాగం అనుకుంటారు. అందుకే మధ్యప్రదేశ్ లో ఎలాంటి అవాంచనీయమైన ఘటన జరిగినా అది తన బాధ్యతగానే భావిస్తారు. ఏ మాత్రం బేషజం లేకుండా వెళ్లి తప్పు దిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి విలక్షణ వ్యక్తిత్వమే ఆయనను ప్రజా నాయకుడిగా నిలబెట్టింది.
ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన
మధ్యప్రదేశ్‌లో ఆదివాసీ యువకుడిపై మూత్రవిసర్జనకు పాల్పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలచి వేసేలా చేసింది. అందుకే శివరాజ్ సింగ్ చౌహాన్ అసాధారణ రీతిలో స్పందించారు. గురువారం భోపాల్‌లోని తన నివాసానికి బాధితుడిని పిలిపించుకుని కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పారు. ఆ యువకుడు తనకు స్నేహితుడిలాంటి వాడని, ఇలాంటి దుశ్చర్యలను సహించేది లేదని అన్నారు.
ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఇల్లు కూల్చివేత
36 ఏళ్ల ఆదివాసీ యువకుడిపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేస్తూ సిగరెట్ తాగుతున్న వీడియో వైరల్ కావడం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్లాను అరెస్ట్ చేయించడంతో పాటు అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయించింది. ఈ నేపథ్యంలో చౌహాన్ బాధితుడిని తన ఇంటికి ఆహ్వానించి పరామర్శించారు. కుటుంబ పోషణకు ఏం చేస్తున్నావు? కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ఈ సందర్భంగా చౌహాన్ ఆరా తీశారు. అనంతరం ఈ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మీ బాధను పంచుకునే ప్రయత్నమిది. మీకు క్షమాపణలు చెబుతున్నా. ప్రజలు నాకు దేవుడితో సమానం’ అని బాధితుడిని ఉద్దేశిస్తూ సీఎం ట్వీట్ చేశారు.
అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగి ఉంటే ?
ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగి ఉంటే… జరిగే పరిణామాలు ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ముఖ్యమంత్రి పూర్తిగా సైలెంట్ గా ఉండటమో లేదా… నిందితుడికి బీజేపీ ముద్ర వేసి రాజకీయం చేయడమో చేస్తారు.కానీ మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా.. చౌహాన్ లా .. నిందితులపై కఠిన చర్యలు.. బాధితులకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోరు. మధ్యప్రదేశ్ లో కూడా అదే చేస్తున్నారు. నిందితుడు అధికార బీజేపీకి చెందిన వ్యక్తని, ఆ పార్టీ గిరిజనులకు రక్షణ కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకే ప్రాధాన్యమిస్తోంది.