గత ఎన్నికల్లో టీడీపీకి దక్కిన 23 సీట్లలో ఒకటి చీరాల. చివరి క్షణంలో అభ్యర్థిని నిలిపినా.. అసలు టిక్కెట్ లేదనుకున్న కరణం బలరాంకు పిలిచి టిక్కెట్ ఇచ్చినా ఆయన గెలిచారు. కానీ పార్టీ ఫిరాయించారు. ఇప్పుడు అక్కడ టీడీపీకి నేత లేరు. అందుకే… స్థానికేతరుడు అయిన కొండయ్య యాదవ్ అనే నేతకు పదవి ఇచ్చారు. కానీ ఆయన అంత చురుకుగా లేరన్న భావన వినిపించడంతో .. చీరాలలో టీడీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అయితే ఇప్పుడు సజ్జా హేమలత అనే నేతను చీరాలకు పంపారు ఆ పార్టీ అగ్రనేతలు.
పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ సజ్జా హేమలత
చీరాలలో బీసీలు ఎక్కువ మంది ఉంటారు. వారికి చాన్స్ ఇస్తామని చెబుతున్నారు కానీ ఇప్పుడు అవసరం కావడంతో బీసీ నేతను రంగంలోకి దించారు. చీరాలలో బీసీ వర్గాలు అధికంగా ఉండటంతో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని లోకేష్ తనను చీరాల పంపారని సజ్జా హేమలత ప్రకటించుకున్నారు. గతంలో పోతుల సునీత టీడీపీ నేతగా ఉండేవారు. ఆమె తెలంగాణలోని ఆలంపూర్ కు చెందిన వారు. ఆయినా టీడీపీ తరపున ఇంచార్జ్ గా వ్యవహరించారు. పోటీ చేసి ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. సజ్జాహేమలత సమీప బంధువు సజ్జ చంద్రమౌళి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు.
2014లోనే టిక్కెట్ ఆశించానంటున్న కొత్త నేత
చీరాలలో మీడియాతో మాట్లాడిన హేమ 2014లో తాను నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించానని, అయితే తమ అధినేత చంద్రబాబు పొన్నూరులో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయమని పంపించారని అన్నారు. 2019లోనూ చీరాల ప్రాంతానికి వచ్చానని, ఆనాటి పరిస్థితుల రీత్యా మౌనం వహించాల్సి వచ్చిందని అన్నారు. లో ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనతో మాట్లాడారని, పార్టీ బలోపేతానికి చీరాలలో పనిచేయాలని సూచించారని అన్నారు. నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న ఎంఎం కొండయ్యతో కలిసి పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళతానని పేర్కొన్నారు. అయితే పార్టీ సూచనల మేరకు తాను పనిచేస్తానని, టిక్కెట్ విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు.
చీరాల నియోజకవర్గంపై టీడీపీ చేతులెత్తేసినట్లేనా ?
సిట్టింగ్ సీటులో ఉన్న నేతలంతా వేరే పార్టీల్లో చేరిపోవడం.. కొత్త నేతలు… ఒకరి తర్వాత ఒకరు తామే నేతలమని ప్రకటించుకుంటూడటంతో సమస్య వచ్చి పడుతోంది. వచ్చే ఎన్నికల్లో కరణం వెంకటేష్ అభ్యర్థి అవుతారని చెబుతున్నారు. ఆయనది దుందుడుకు స్వభావం. ఇప్పటికే టీడీపీ తరపున అద్దంకిలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో రెండు ప్రధాన పార్టీలు అక్కడ సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.