రాజకీయ శక్తుల పునరేకీకరణ – బీజేపీ దిశగా చిరాగ్ పాశ్వాన్

బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్డీయే అత్యంత బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార జెడీయూ, ఆర్జేడీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఎన్డీయేలోకి చేరేందుకు ఇష్టపడుతున్నాయి. బీజేపీతో చర్చలు జరుపుతున్నాయి. నితీశ్ ప్రభుత్వ విధానాలతో విసుగుచెందిన పార్టీలన్నీ ఇప్పుడు ఎన్డీయే వైపు చూస్తున్నాయి.

నిత్యానంద రాయ్ తో చిరాగ్ పాశ్వాన్ భేటీ

దివంగత కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ .. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్ సభ సభ్యుడైన ఆయన ఎల్జేపీలోని ఒక గ్రూపుకు నాయకత్వం వహిస్తున్నారు. మరో గ్రూపుకు ఆయన బాబాయి అయిన కేంద్ర మంత్రి పసుపతి కుమార్ పరస్ నాయకత్వం వహిస్తున్నారు. చిరాగ్ వర్గాన్ని కలుపుకుపోయేందుకు ఇష్టపడే బీజేపీ ఆయనతో చర్చలు జరుపుతోందన్న వాదన తెరపైకి వచ్చింది.

మంత్రి పదవి కోసం కాదన్న చిరాగ్

కేంద్ర మంత్రి పదవి కోసం చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలను ఆయన స్వయంగా తోసిపుచ్చారు. కేంద్ర మంత్రి పదవి అప్రస్తుతమని… లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసమే తాను ప్రయత్నిస్తున్నానని చిరాగ్ చెప్పుకున్నారు. పోత్తుపై నిర్ణయం చిరాగ్ కే వదిలేస్తున్నట్లు ఎల్జేపీ పార్లమెంటరీ పార్లీ ప్రకటించగా… ఏదైనా బీజేపీ వైపు నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే అధికారికంగా స్పందిస్తానని కొంత సమయం తీసుకోవడంలో తప్పులేదని ఆయన అంటున్నారు. చిరాగ్ ఎన్డీయేలో చేరడం మాత్రం ఖాయమని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రధాని మోదీ అనుమతి వచ్చిన తర్వాత ప్రకటన ఉంటుందని తెలిపాయి.

ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం

పరస్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అనివార్యంగా చిరాగ్ పాశ్వాన్ బీజేపీకి దూరం జరిగిన మాట వాస్తవం.అప్పుడు బిహార్లో సామాజిక వర్గ సమీకరణాలు, రాజకీయాలను లెక్కచూసుకుని బీజేపీ, పరస్ ను దగ్గరకు చేర్చుకుంది. తర్వాత దళిత నేతగా చిరాగ్ కు ఉన్న పాపులారిటీని ఎన్డీయే పెద్దలు గుర్తించారు. మహాకూటమి దొడ్డిదారిన అధికారానికి వచ్చిన తర్వాత ఇటీవల బిహార్లో జరిగిన మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున చిరాగ్ పాశ్వాన్ ప్రచారం చేశారు. అందులో రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆ విజయం వెనుక చిరాగ్ శ్రమను బీజేపీ అధినాయకత్వం గుర్తించింది. దానితో చిరాగ్ తో పొత్తు పెట్టుకుంటే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి ఖాయమన్న అభిప్రాయానికి వచ్చింది.