భారత్ ను దొంగదెబ్బ తీసే రెండు దేశాలు మరోసారి ఏకమయ్యాయి. సరిహద్దుల్లో తమ దుశ్చర్యలను ప్రదర్శిస్తూ ఇబ్బందిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయి. మనదేశంపై కసితో పాకిస్థాన్ కు సాయం చేసే దిశగా ఎంతకైనా దిగజారే డ్రాగన్ కంట్రీ… అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం పాకిస్థాన్ కు ఉచితంగా అందిస్తున్నట్లు సమాచారం..
అవి హైటెక్ పరికరాలు…
గంటల తరబడి గగనంలో తిరుగుతూ, ఎక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్స్ ను చైనా ప్రభుత్వం ఇప్పుడు పాకిస్థాన్ కు సరఫరా చేసింది. అందులోనూ వందల సంఖ్యలో ఆ డ్రోన్స్ వచ్చి చేరినట్లు సమాచారం. పాక్ లోని లాహోర్, కసూర్, షేక్ పురా నుంచి టేకాఫ్ తీసుకునే ఆ డ్రోన్లు.. మన పంజాబ్ లోకి చొట్టుకొచ్చి ఆయుధాలు, మాదక ద్రవ్యాలను జారవిడిచి వెళ్లున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే కొందరు వ్యక్తులు వాటిని ఆపరేట్ చేస్తుండగా అమృత్ సర్ జిల్లా సహా కొన్ని ప్రాంతాల్లో డ్రగ్స్, ఆయుధాలు జారవిడిచి డోన్స్ వెనక్కి వెళ్లిపోతున్నాయి.
200 డ్రాపింగ్ జోన్స్
భారత భౌగోళిక పరిస్థితులను బాగా అర్థం చేసుకున్న స్మగ్లర్లే ఈ డ్రోన్సను నిర్వహిస్తున్నట్లు బీఎస్ఎఫ్, ఆర్మీ, పంజాబ్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. అందులో 200 ప్రదేశాలు కీలకమైనవిగా గుర్తించారు. ఈ ఏడాది 26 డ్రోన్లను భద్రతా దళాలు కూల్చాయి. 165 డ్రోన్స కదలికలను జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో గుర్తించారు. సాధారణంగా ఈ డ్రోన్లను రాత్రి పది నుంచి ఉదయం నాలుగు గంటల మధ్య ఆపరేట్ చేస్తున్నారు. భద్రతా దళాల దృష్టిలో పడకుండా ఉండేందుకు 15 వందల నుంచి 2 వేల మీటర్ల ఎత్తులో డ్రోన్స్ ఎగురవేస్తున్నారు. ఆయుధాలు, డ్రగ్స్ జారవిడిచే లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు అవి 700 మీటర్ల దిగుపకు వస్తున్నాయి..
గంటలో పనిపూర్తి చేయాలి
డ్రోన్లు బయలుదేరిన 55 నిమిషాల నుంచి గంట లోపు నిర్దేశిత ప్రదేశంలో ఆయుధాలు, డ్రగ్స్ జారవిడిచి వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుంది. డ్రోన్ తో పాటు వాటిలో ఉన్న వస్తువుల మొత్తం బరువు ఐదు నుంచి ఏడు కిలోలు ఉండటంతో అవి తేలికపాటివని గుర్తించారు. కొన్ని సందర్భాల్లో ఏకే-47 తుపాకులను కూడా వాటిలో పంపిస్తున్నారు. ఆత్యాధునిక కెమెరాలను డ్రోన్లలో అమర్చి భారత భూభాగాన్ని వీడియోలు, ఫోటోలు కూడా తీస్తున్నారు. భారత్లోని స్మగ్లర్లు వాటిని అందుకనే విధంగా డ్రోన్లపై కోడ్ ఉంటుంది. తీసుకు వచ్చిన వస్తువులను అవి ఎక్కడ జారవిడుస్తున్నాయో తెలిసిపోతోంది. డ్రన్లను భారత భద్రతా దళాలు కూల్చివేసిన పక్షంలో పాకిస్థాన్ లోని స్మగ్లింగ్ వాటిలోని డేటాను తక్షణమే ఆన్ లైన్లో తొలగించే టెక్నాలజీని చైనా నుంచి పాకిస్థాన్ దిగుమతి చేసుకుంది. చైనా కంపెనీ డీజేఐ ఈ డ్రోన్లను సరఫరా చేసినట్లు వాటిపై ఉన్న గుర్తుల ఆధారంగా నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్లలో ఉన్న చిప్స్ ను ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి అక్కడ డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియరాలేదు.