మోదీకి చైనా ప్రశంసలు

చైనాకు భారత్ అంటే గిట్టదు. గల్వాన్ ఘటనకు ముందు, ఆ తర్వాత భారత్ పై కారాలు మిరియాలు నూరుతునే ఉంటుంది. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా తను తప్పు చేస్తూ భారత ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. అంతర్జాతీయ వేదికల్లో నిత్యం భారత్ కు వ్యతిరేకంగా ఉపన్యాసాలు, ఓటింగులు నిర్వహిస్తుంది. ఐకరాజ్యసమితిలో భారత్ ఎలాంటి తీర్మానం ప్రవేశ పెట్టినా చైనా దాన్ని వీటో చేస్తుంది. అలాంటి చైనా ఇప్పుడు ప్రధాని మోదీ పట్ల మాత్రం సానుకూల ప్రకటన చేసింది. మోదీ గొప్పదనాన్ని ప్రశంసించింది….

మోదీ నిర్ణయాలను ప్రశంసించిన గ్లోబల్ టైమ్స్…

చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వ్యాసంలో మోదీ ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను కొనియాడింది. ప్రపంచ వాణిజ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాల్లో నరేంద్ర మోదీ నేతృత్వ భారత ప్రభుత్వం చర్యలు అమోఘమని ప్రశంసించింది. షాంఘై నగరంలో ఉండే ఫుడాన్ విశ్వవిద్యాలయం దక్షిణాసియా అధ్యయన విభాగం డైరెక్టర్ ఝూంగ్ జియాడాంగ్ ఈ వ్యాసాన్ని రాశారు. భారత్ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తు కొత్త ప్రభావశీల దేశంగా నిలుస్తోందని ఆయన మెచ్చుకున్నారు. గడిచిన పదేళ్లలో వ్యూహపరంగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ నేటి బహుళ ధృవ ప్రపంచంలో భారత్ ఒక విశిష్ట ధృవంగా అవతరిస్తోందన్నారు.

ఆర్థిక, సామాజిక సాధనలు..

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందు వరుసలో ఉందని, ఆర్థిక రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిన గ్లోబల్స్ టైమ్స్ లో రచయిత ప్రస్తావించారు. రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పట్టణాభివృద్ధి పరుగులు పెడుతోందని ఝూంగ్ జియాడాంగ్ అన్నారు. సామాన్య ప్రజలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించడంలో మోదీ సర్కారు విజయం సాధించిందన్నారు. వాణిజ్యరంగంలో చైనాతో సంబంధాలు మరింతగా మెరుగుపడ్డాయని ఇప్పుడు భారత్ శక్తిమంతమైన పోటీదారుగా నిలిచే పరిస్థితి వచ్చిందని అన్నారు.

దౌత్య వ్యూహాల్లో మోదీ దిట్ట

విదేశాలతో భారత సంబంధాలు అన్ని విధాలుగా మెరుగు పడ్డాయని, పరిసితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంతో మోదీ సక్సెస్ అయ్యారని గ్లోబల్ టైమ్స్ పొగిడింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాలకు మద్దతివ్వకుండా భారత్ తన ప్రయోజనాలను కూడా కాపాడుకుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండే భారత్ .. పడమటి దేశాలతోనూ దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ పరస్పర ప్రయోజనకర విధానాలను పాటిస్తోందన్నారు. ప్రపంచం మొత్తం మోదీ తీరును ప్రత్యేకంగా గమనిస్తూ దాని నుంచి పురగోమన విధానాలను అలవాటు చేసుకునే ప్రయత్నంలో ఉందని అన్నారు.మోదీ నాయకత్వంలో భారత వ్యవస్థలు రూపాంతరం చెందుతున్న తీరు, శక్తిమంతమైన దేశంగా మారుతున్న క్రమంలో ముందుకు వస్తున్న పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది. భారత్ ఇప్పుడు భౌగోళిక, రాజకీయ శక్తి అని ప్రశంసించిన చైనా గ్లోబల్ టైమ్స్…అది కాదనలేని సత్యమని కూడా ఒప్పుకుంది.