భారత చర్యలకు అవరోధం – ఉగ్రవాదులకు చైనా ఊతం

శాంతి కాముక రాజ్యంగా అసత్య ప్రచారాలు చేసుకునే చైనా ప్రభుత్వం పరోక్షంగా ఉగ్రవాదులకు ఊతమిస్తూనే ఉంది. అందులోనూ భారత్ పై దాడులకు ప్లాన్ చేసే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులనైతే చైనా ప్రభుత్వం సొంత మనుషుల్లా చూసుకుంటుంది. వారిపై కఠిన చర్యలకు భారత్ ప్రతిపాదించినప్పుడల్లా వీటో చేయడం, తీర్మానాన్ని బ్లాక్ చేయడం, తిరస్కరించడం చైనాకు నిత్య కృత్యమైంది. తాజాగా లష్కరే తయ్యాబాకు చెందిన సాజిద్ మీర్ ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐక్యరాజ్యసమితిలో భారత్ – అమెరికా ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతిచ్చేందుకు చైనా నిరాకరించింది. ఆ తీర్మానాన్ని చైనా బ్లాక్ చేసింది. భద్రతా సమితిలో ఈ తీర్మానం ఆమోదం పొంది ఉంటే అతని ఆస్తులను జప్తు చేసే వారు, అతని ప్రయాణాలపై నిషేధం విధించేవారు. అతనికి ఆయుధాలు అందకుండా అడ్డకునే వారు. గతేడాది ఈ తీర్మానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసిన చైనా, ఈ సారి ఏకంగా బ్లాక్ చేసేసింది.

సాజిద్ మీర్ ఎవరూ ?

సాజిద్ మీర్ , భారత్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతనిపై అమెరికా ప్రభుత్వం ఐదు మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. సాజిద్ మీర్ చనిపోయాడని కొంతకాలం క్రితం వాదించిన పాక్ ప్రభుత్వం తర్వాత మాత్రం అతను క్రియాశీలంగానే ఉన్నాడని అంగీకరించింది. అతను ఇబ్రహీం, వాసి లాంటి అనేక పేర్లతో తిరుగుతున్నాడని అమెరికా ఎఫ్బీఐ ఎప్పుడో ప్రకటించింది. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారిగా సాజిత్ మీర్ ను పరిగణిస్తున్నారు. ఆ దాడిలో ఆరుగురు అమెరికన్ల సహా 170 మంది చనిపోయారు. డెన్మార్క్ లో ఉగ్రదాడులకు కూడా సాజిత్ మీర్ ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు నిర్థారించాయి. 2011లోనే అమెరికా ప్రభుత్వం అతనిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.

పాకిస్థాన్లో జైలు శిక్ష – చైనా మాత్రం మద్దతు

సాజిద్ మీర్ తమ భూభాగంలో లేడంటూ వాదించిన పాకిస్థాన్ ప్రభుత్వం చివరకు 2022లో అతడ్ని అరెస్టు చేసింది. లాహోర్ యాంటీ టెర్రరిస్ట్ కోర్టు ఆతనికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించింది. అంతర్జాతీయ ఒత్తిడి మేరకే పాకిస్థాన్ ఆ పని చేసింది. అప్పటికే పాకిస్థాన్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ( ఫాఫ్ట్), గ్రే లిస్టు పెట్టింది, దీని వల్ల పాకిస్థాన్ కు వచ్చే ఆర్థిక సాయం ఆగిపోయే ప్రమాదం ఏర్పడటంతో సాజిద్ మీర్ కు జైలు శిక్ష విధించి గ్రే లిస్టు నుంచి తమను తొలగించాలని కోరింది.

చైనా ఎందుకలా చేస్తోంది..

ఉగ్రవాదం విషయంలో భారత్ కు వ్యతిరేకంగా చైనా ప్రవర్తించడం ఇది మొదటి సారి కాదు. జైషే మొహ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయంలో కూడా చైనా టెక్నికల్ హోల్డ్ క్లాజ్ ను వాడుకుంది. పాక్ లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు దిగే జకీర్ ఉల్ రెహమాన్ లఖ్వీ, సయ్యద్ సలావుద్దీన్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో భారత్ తీర్మానాలను ప్రవేశపెట్టినప్పుడు కూడా చైనా అడ్డుకుంది. అదేమని అడిగితే భారత్ – అమెరికా సంయుక్త తీర్మానాలను అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలని చైనా అంటోంది. భారత్ – అమెరికా కలిసి ప్రవేశ పెట్టే ఏ తీర్మానాన్నైనా తిరస్కరించాలని చైనా విధానంగా పెట్టుకున్నట్లు భావించాల్సి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నిషేధానికి గురి కావాల్సిన ఉగ్రవాదిని చైనా ఎందుకు కాపాడుతుందో అర్థం కావడం లేదని భారత విదేశాంగ శాఖ అంటోంది. డ్రాగన్ కంట్రీ బుద్ధి మారి ఉగ్రవాదానికి ఊతమివ్వడం మానుకోవాలని సూచిస్తోంది. మరి చైనా అర్థం చేసుకుంటుందో లేదో….