ఛత్తీస్ గఢ్ ఎన్నికలు – భద్రత కోసం మహిళా కమాండోలు

కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము లాంటిదే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం అహర్నిశలు కష్టపడినా ఏదోక సమస్య వస్తూనే ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యల కారణంగా ఎన్నికలకు ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. ఆ సమస్యలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడం వల్లే జటిలమై కూర్చుంటున్నాయన్నది ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిన అంశం.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సుక్మా, బస్తర్, దంతేవాడ, బీజాపూర్ జిల్లాలు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా మారాయి. అక్కడ నక్సల్స్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనంపై పెత్తనం సాగిస్తున్నారు.తమకు ఎదురు తిరిగిన వారిని చంపేస్తుంటారు. మందుపాతరలు పెట్టి భద్రతా దళాలను హతమార్చుతుంటారు. ప్రతీ ఏడాది ఆ జిల్లాల్లో మావోయిస్టు హింసకు 300 నుంచి 500 మంది చనిపోతుంటారు. పోలీసు ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు కొంతమందిని చంపెయ్యడం నిత్యకృత్యమవుతోంది.

ఎన్నికల నిర్వహణకు తీవ్ర కష్టాలు

దంతేవాడ సహా నాలుగు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ప్రతీ సారి కొత్త సమస్యలు సృష్టిస్తుంది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించే మావోయిస్టులు మెరుపు దాడులు చేస్తుంటారు. 2018 ఎన్నికల్లో మావోయిస్టులు ఏకంగా 16 చోట్ల దాడులు చేశారు. ఆ దాడుల్లో 30 మంది వరకు చనిపోయారు. మృతుల్లో ఒక మీడియా ప్రతినిధి కూడా ఉన్నారు. అందుకే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సిబ్బంది భయపడతారు. భద్రతా సిబ్బంది వెనుకాడుతారు.

సిబ్బందికి కమాండో శిక్షణ

మావోయిస్టులు ఎక్కువగా తిరిగే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఎన్నికల భద్రతకు ఈ సారి కూడా స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. బస్తర్ జిల్లాలో ఆర్మీని కూడా రంగంలోకి దించుతారు. స్థానిక పరిస్థితులపై అవగాహన కోసం లోకల్స్ ని భద్రతా చర్యల్లో నియమించేందుకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ నాలుగు జిల్లాలో మహిళా కమాండోలను నియమిస్తారు. మహిళలకు తొలుత కమాండో శిక్షణ ఇచ్చి తర్వాత జిల్లాలకు పంపుతారు. పోలింగ్ నిర్వహణలో సిబ్బందికి సహాయపడే శిక్షణ కూడా వారికి కల్పిస్తారు. దంతేవాడ, సుక్మా జిల్లాల్లో నియమించే మహిళా కమాండోలను దంతేశ్వరీ ఫైటర్స్, దుర్గా ఫైటర్స్ అని పిలుస్తారు. భద్రత దృష్ట్యా ఈ సారి కూడా చత్తీస్ గఢ్ లో ఎన్నికలను నాలుగైదు దఫాలుగా నిర్వహించబోతున్నారు. బస్తర్ డివిజన్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నందున అక్కడ కనిష్టంగా 50 వేల మంది సీఆర్పీఎఫ్, ఐటీబీపీ సిబ్బందిని నియమిస్తున్నారు. వారికి హైదరాబాద్ లో శిక్షణ ఇచ్చారన్నది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం.