మధ్యభారతంలో ఎన్నికల నగారా మోగేందుకు ఎక్కువ సమయం లేదు. ఈ ఏడాది డిసెంబరు లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా… పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. బీజేపీ తొలి జాబితాను ప్రకటించి ఓ ముందడుగు వేసినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ప్రవర్తిస్తోంది. వైరీ వర్గాలు కత్తులు దూస్తున్నట్లు కనిపిస్తున్నా…ఎన్నికల వేడి మాత్రం అంతగా ప్రొజెక్ట్ కావడం లేదు.
స్కాముల కేంద్రంగా మారిన రాష్ట్రం
దేశంలో అందరూ ఢిల్లీ లిక్కర్ స్కాం గురించే మాట్లాడుకుంటున్నారు.. దాదాపు అదే స్థాయిలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కాం జరిగింది. ప్రభుత్వ ఖజానాకు రూ.2 వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు లెక్కగట్టారు. ఈడీ విచారణ జరుగుతోంది. కొన్ని అరెస్టుకు కూడా చేశారు. సీఎం భూపేష్ భాగెల్ ప్రభుత్వంలో బొగ్గు స్కాం కూడా జరిగింది. అందులో ముఖ్యమంత్రి డిప్యూటీ సెక్రటరీ ప్రమేయం ఉందని నిర్ధారించారు. చెప్పాలంటే చిన్న చిన్న స్కాములు చాలానే ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతిమయమైందని మీడియా కోడై కూస్తోంది. అంత జరుగుతున్నా రాష్ట్రంలో బీజేపీ మాత్రం మనుతిన్న పాములా పడుంది.
చొరవ చూపకపోవడమే కారణమా ?
లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన చాలా డాక్యుమెంట్లు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, అవినీతిపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో ఛత్తీస్ గఢ్ బీజేపీ ఫెయిలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈడీ చేసిన ఆరోపణలను జనానికి అర్థమయ్యేట్టుగా చెప్పగలిగితే అది గేమ్ ఛేంజర్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే.ఇప్పటికైనా ఉదాసీనతను పోగొట్టుకుని అస్త్రశస్త్రాలను బయటకు తీయాలని బీజేపీ అభిమానులు కోరుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లాంటి నేతలు మరింత చొరవ చూపితే పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచినట్లవుతుందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతోంది.
బస్తర్, సర్గూజా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మత మార్పిడుల సమస్యపై కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టాలి.మావోయిస్టు ప్రభావిత బస్తర్, సర్గూజా ప్రాంతాల్లో ఇప్పుడు కన్వర్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు డివిజన్లల్లో 15 శాతం ఓట్లు ఈ అంశంపైనే ఆధారపడి ఉన్నాయి. పైగా ఆదివాసీ క్రైస్తవులు వర్సెస్ నాన్ క్రిస్టియన్స్ ఘర్షణలు తారా స్థాయికి చేరాయి. ఈ ఘర్షణల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారి అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించాల్సి ఉంది. గిరిజనులకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఎక్స్ పోజ్ చేయగలగాలి. మతమార్పిడికి పాల్పడిన వారిపై దాడులను ఆపేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం లేదన్న ఆరోపణలున్న తరుణంలో బీజేపీ అక్కడి ప్రజలను తమ వైపుకు తిప్పుకోవాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో….