మలక్‌పేటలో ఈ సారి ఎంఐఎంకు చెక్ – బీజేపీకి అడ్వాంటేజ్ !

హైదరాబాద్ ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న మలక్ పేట నియోజకవర్గంలో బీజేపీకి ఈ సారి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లోMIM నుంచి బలాల విజయం సాధిస్తున్నారు. 2020 డిసెంబర్ లో జరిగిన GHMC ఎన్నికల్లో మలక్ పేట నియోజకవర్గంలోని సైదాబాద్ , మూసారాంబాగ్ డివిజన్ల లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మలక్ పేట లో బీజేపీ జెండా ఎగురవేసి ఎంఐఎం కంచుకోట ను బద్దలు కొట్టేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

బీఆర్ఎస్ మద్దతుతో గెలుస్తున్న ఎంఐఎం

మలక్ పేట నియోజకవర్గంలో 2 లక్షల 76 వేల మంది ఓటర్లు ఉన్నారు.మలక్ పేట నియోజకవర్గం ఒకప్పుడు బీజేపీ కి ,కాంగ్రెస్ కంచుకోట. ఉమ్మడి మలక్ పేట నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఇంద్రసేనా రెడ్డి , కాంగ్రెస్ నుంచి సుధీర్ కుమార్ , మల్ రెడ్డి రంగారెడ్డి పలు మార్లు MLA లుగా విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగక ముందు.. మలక్ పేట అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. పునర్విభజనలో.. మలక్‌పేటకు.. ముస్లిం ఓటర్లు ఎక్కువగా చూసి విభజించారు. దాంతో.. 2009 , 2014 ఎన్నికల్లో మజ్లిస్ విజయం సాధించింది. మ‌ల‌క్ పేట నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపి అభ్యర్ది ఆలె జితేంద్రపై ఎంఐఎం అభ్యర్ది బ‌లాల 30 వేల మెజారిటితో గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంఐఎం నుంచి బ‌లాల, బీజేపి నుంచి ఆలె జితేంద్ర మరోసారి పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

హిందూ ఓటర్లు ఏకం అయితే బీజేపీదే గెలుపు !

మలక్ పేట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,79,766 అందులో పురుషులు -1,43,886 మహిళలు – 1,35,860 మంది ఉన్నారు. మలక్ పేట, సైదాబాద్, చంచల్ గూడ, అజంపురా, మూసారాంబాగ్, గడ్డి అన్నారం, చాదర్ ఘాట్ ప్రాంతాలు మలక్ పేట నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ముస్లిం ఓటర్ల కంటే.. హిందూ ఓటర్లు ఎక్కువే . కానీ.. మజ్లిస్ కోసం.. హిందూ ఓట్లను చీల్చేందుకు పార్టీలన్నీ హిందూ అభ్యర్థులనే నిలబెడతాయి. ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై వ్యతిరేకత ఉండటం.. కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడంతో బీజేపీ పని సులువు అవుతోంది. యోగి ఆదిత్యనాథ్‌తో మలక్ పేటలో ప్రచారం చేయించాలనే ఆలోచన చేస్తున్నారు.

గ్రేటర్ లో బలంగా బీజేపీ

గ్రేటర్​లో మిగిలిన పార్టీలకంటే బీజేపీ బలంగా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి హైదరాబాద్​కు ఎన్నో నిధులు ఇచ్చామని, సిటీ అభివృద్ధిలో తమ పార్టీ పాత్ర ఎంతో ఉందని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్​సర్కార్ పై ప్రజా వ్యతిరేకతే తమ పార్టీకి అనుకూలంగా మారనుందని అంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బూత్​స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండడంతో ఈసారి అధిక సీట్లను గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. ప్రత్యేకించి ఓటు బ్యాంకుపై పూర్తి నమ్మకంతో ఉంది. కేంద్ర పథకాలు, అభివృద్ధి, సామాజికాంశాలు అనుకూలమైనవని కమలం నేతలు భావిస్తున్నారు.