ప్రజల్ని మోసం చేయడం అంత వీజీ కాదు – స్టీల్ ప్లాంట్ రాజకీయాలతో ప్రాంతీయ పార్టీలు బోర్లా !

స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయం చేసి బీజేపీని కార్నర్ చేద్దామని.. తామే మెడలు వంచేశామని ప్రచారం చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు… ఉప ప్రాంతీయ పార్టీలు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ప్రజల ముందు వారి పరువు పోయింది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే నేరుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. దానికి దాన్ని ఏపీ, తెలంగాణ రాజకీయ పార్టీలు తమ సొంత రాజకీయాన్ని కలిపేసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మెడలు వంచేశామని ప్రకటించుకున్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని బీఆర్ఎస్ నేతలు బీరాలు పోయారు.

గొప్పలు చెప్పుకోవడానికి ముందుండే కేటీఆర్ లాంటి నేతలు.. కేసీఆర్ దెబ్బకు దిగి వచ్చిన కేంద్రం అని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. తర్వాత హరీష్ రావు .. ఇతరులు కూడా అదే ప్రకటన చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా హోరెత్తించింది. నిజంగానే స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ ఏదో సాధించిందేమో అనే అనుమానం చాలా మందికి వచ్చింది . కానీ తమ విధానంలో మార్పు లేదని.. స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని కేంద్రం చేసిన ప్రకటనతో వారి గాలి మొత్తం పోయినట్లయింది. బీఆర్ఎస్ పార్టీని ఏపీలో విస్తరించడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని ఓ అవకాశంగా చేసుకున్నారు. అందుకే మూలధన సమీకరణ కోసం జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో బిడ్ వేస్తామని ప్రకటించారు. సింగరేణి అధికారుల్ని పంపారు.

ఇప్పడు బిడ్ వేసే అవకాశాలు లేవు. శనివారమే బిడ్ కు ఆఖరు తేదీ . ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బిడ్ వేయడం లేదని.. న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు సంకేతాలు పంపాయి. అదే సమయంలో కేంద్రం తాము ప్రైవేటీకరణ ఆపలేదని ప్రక్రియ సాగుతోందని ప్రకటించింది. క్రెడిట్ కోసం పోటీపడిన పార్టీలు బీఆర్ఎస్‌తో పాటు బోర్లా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ తాము పోరాటం చేస్తామంటున్నాయి.

భారతీయ జనతా పార్టీ చేసిన రాజకీయంతో ఆ పార్టీ స్ట్రాటజీ క్లియర్ గా నే ఉన్నట్లుగా ప్రజలకు స్పష్టమవుతోంది. కానీ ఇతర పార్టీలను మాత్రం ఓ మూడు రోజుల పాటు ఓ ఆట ఆడుకుంది .. ప్రజల ముందు వారిని నవ్వుల పాలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ ట్రాప్‌లో రాజకీయ పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పరువు పోయినట్లయింది.