చీపురుపల్లిలో మారిన రాజకీయం – పుంజుకుంటున్న కూటమి అభ్యర్థి

చీపురుపల్లి అసెంబ్లీ నియోకవర్గం ఎన్నిక రసకందాయకంగా మారింది. అటు వైసిపి, ఇటు టిడిపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రెండు పార్టీల నుంచి రాజకీయ ఉద్దండులు రంగంలోకి దిగారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ జిల్లాలోనే అత్యల్పంగా ఏడుగురు మాత్రమే పోటీలో నిలవగా,కాంగ్రెస్‌, బిఎస్‌పి, స్వతంత్ర అభ్యర్ధులు నామమాత్రంగానే పోటీ ఇస్తున్నారు. వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, టిడిపి నుంచి మాజీ మంత్రి కళా వెంకటరావు పోటీలో నిలిచారు.

మారుతున్న సమీకరణాలు

చీపురుపల్లి నియోజకవర్గంలో రోజురోజుకూ సమీకరణాలు మారుతున్నాయి. ఇరు పార్టీల నుంచి జంపింగ్‌లు ఉండడంతో అంతా అయోమయం నెలకొంది. మంత్రి బొత్స సత్యన్నారాయణ అభివృద్ధి, సంక్షేమం గెలుపు దిశగా ప్రచారం చేస్తుంటే అటు కళావెంకటరావు వలసలతో పాటు తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బొత్స సత్యన్నారాయణ మొట్టమొదటిసారిగా చీపురుపల్లి నియోజవకవర్గం నుండి 2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుండి చీపురుపల్లి నియోజకవర్గంలో తనకంటూ బలమైన కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. 2014లో ఓడి పోయినప్పటికీ తిరిగి 2019లో వైసిపి నుంచి పోటీ చేసి 26 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

విశాఖ ఎంపీ సీటులో భార్యను గెలిపించేందుకు బొత్స కసరత్తు

ఎన్నికలలో నియోజకవర్గంలోని 120 పంచాయతీలలో బొత్స సందీప్‌ నాయుడు, మేనల్లుడు జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఆయా మండలాల వైసిపి నాయకులు అహర్నిశలూ శ్రమించి బొత్స ను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. బొత్స విశాఖ ఎంపీ సీటులో పోటీ చేస్తున్న తన భార్య ఝాన్సీ కోసం పని చేసుకుంటున్నారు. టిడిపి అభ్యర్థి కిమిడి కళావెకంటరావును కాస్తా ఆలస్యంగా ప్రకటించినప్పటికీ బొత్సకు గట్టి పోటీ ఇస్తున్నారు. తన అనుభవాన్నంతటిని రంగరించి ప్రచారంలో దూసుకు పోతున్నారు. మొదటిలో వలస నేతకు టిక్కెట్టు ఇచ్చారేమిటి అనుకున్న ఆ పార్టీ నాయకులు, ప్రజలు నేడు ఏ గ్రామానికి వెళ్లినా స్వాగతం పలుకుతుఆన్నరు.

టీడీపీలో అన్ని గ్రూపులు కలిసి పని చేస్తున్న వైనం

టిడిపిలోని గ్రూపులన్నింటినీ ఒక్కటి చేయడంలో సఫలీకృతుడయ్యాడు. అంతే గాకుండా బొత్స సత్యనారాయణకు గత ఎన్నికలలో అండగా ఉన్న మెరకముడిదాం మండలాన్ని తన వైపు తిప్పుకోవడంలో కొంతవరకు విజయం సాధించారు. అయితే ఇక్కడ టిక్కెట్‌ ఆశించిన, జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మొదట్లో అలకబూనినప్పటికీ చంద్రబాబు జోక్యంతో కళా వెంకటరావుకు సహకరిస్తున్నారు. పార్టీలో అనుభవం ఉన్న గద్దే బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజును ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ప్రచారం సాగిస్తున్నారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ హోరాహోరీగా సాగుతోంది.