తిరుపతి ఎంపీ అభ్యర్థి మార్పు – సీఎం జగన్ వ్యూహం అదేనా ?

రాష్ట్రంలో రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని జగన్‌ వ్యూహరచన చేస్తున్నారు. ఎంపిలకన్నా, ఎంఎల్‌ఎ సీట్లకు ప్రాధాన్యత ఇస్తూ ‘గెలుపు గుర్రాలకు’ టిక్కెట్లు కేటాయిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తు జరిపి సీట్లు కేటాయించారు. దీంతో ఎంపీ అభ్యర్థి మారిపోయారు.

సత్యవేడు ఎమ్మెల్యేకు ఎంపీ సీటు

సత్యవేడు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ఆదిమూలంపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండడంతో తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తిని ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే ఆదిమూలంను తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి అవకాశం ఇచ్చారు. ఆదిమూలం నిరంతరం జనంలో ఉన్నప్పటికీ పార్టీలోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి, తొలినుంచి పార్టీలో ఉన్న వారిని విస్మరించారన్న అక్కస్సు ఆ నియోజకవర్గంలో ఉంది. దీంతో ఎప్పటినుంచో రెండు గ్రూపులుగా ఆ నియోజకవర్గంలోని శ్రేణులు విడిపోయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. జగన్మోహన్‌రెడ్డి తాజాగా జరిపిన సర్వేలోనూ ఆదిమూలం పట్ల వ్యతిరేకత ఉన్నట్లుగా నివేదిక వచ్చినట్లు సమాచారం.

ఎంపీ గురుమూర్తి సత్యవేడుకు !

2019 ఎన్నికల్లో ఆదిమూలం గెలుపు కోసం ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ద్వితీయశ్రేణి నాయకులు బీరేంద్రవర్మకు తొలుత శ్రీకాళహస్తి ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ ప్రకటించారు. అయితే శ్రీకాళహస్తి నుంచి ‘స్థానికత’ పేరుతో వ్యతిరేకత రావడంతో ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వయంగా తన అనుయాయులైన అంజూరు శ్రీనివాసులుకు ఇప్పించుకున్నారు. ఎంఎల్‌ఎ ఆదిమూలం ఈ విషయంలో సిఎం వద్ద గట్టిగా మాట్లాడలేకపోయారన్న బాధ బీరేంద్రవర్మలో ఉంది. అలాగే టిటిడి బోర్డు సభ్యునిగానూ అవకాశం ఇస్తారని చర్చ నడిచింది. తీరా కేటాయింపుల్లో నిరాశే మిగిలింది. దీంతో బీరేంద్రవర్మ గ్రూపు సిఎంను కలిసి ఆదిమూలంకు సీటు ఇస్తే తాము పనిచేయబోమని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంఎల్‌ఎ ఆదిమూలం అయినప్పటికీ ఆయన కొడుకే ఆ పదవిలో చెలాయిస్తూ భూకబ్జాలు, మట్టిమాఫియాతో కోట్లు దండుకున్నారన్న విమర్శలను ఆ కుటుంబం మూటకట్టుకుంది.

కీలక నేతలంతా దారిలోకి వచ్చినట్లే !

కాంట్రాక్టుల్లోనూ, శ్రీకాళహస్తి ట్రస్టుబోర్డు, టిటిడి బోర్డు.. ఇలా అన్నింటిలోనూ నిరాశతో ఉన్న బీరేంద్రవర్మ ఈసారి ఎంఎల్‌ఎ ఆదిమూలం గెలుపు కోసం పని చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల్లో ఎంపిగా గెలుపొందిన మద్దిల గురుమూర్తిని సత్యవేడు ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ఖరారు చేసి, ఆదిమూలంను ఎంపి అభ్యర్థిగా బదలాయించి దళితుల నుంచి వ్యతిరేకత రాకుండా జగన్మోహన్‌రెడ్డి పావులు కదిపినట్లుగా అనుకోవచ్చు. .