కళ్యాణదుర్గం టిడిపిలో మూడు ముక్కలాట జరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ప్రముఖ కాంట్రాక్టర్, ఎస్‌ఆర్ కన్‌స్ట్రషన్స్ సంస్థ అధినేత అమిలినేని సురేంద్రబాబు రంగంలోకి దిగారు. టిడిపి టిక్కెట్టు వారికే ఖరారవుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో ఆయన కళ్యాణదుర్గం పట్టణంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం బలాన్నిస్తోంది. దీంతో ఈ నియోజకవర్గంలో మూడు అధికారిక కేంద్రాలు టిడిపిలో వెలిసినట్టవుతోంది.
ఉన్నంకు హ్యాండిచ్చి ఉమా మహేశ్వరనాయుడికి టిక్కెట్
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అంతకు మునుపున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కాదని ఉమామహేశ్వర నాయుడుకి టిక్కెట్టు ఇచ్చారు. అయితే టిక్కెట్టు మార్పు జరగడంతో హనుంతరాయచౌదరి సహకారం అందించలేదు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందింది. తదనంతరం కూడా ఈ విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. అనేక సందర్భాల్లో రెండు గ్రూపుల మధ్య విభేదాలు బాహాటంగానే కొనసాగుతూ వచ్చాయి. అనేక మార్లు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఫలితం లేదు. ఇప్పటికీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులే ఉన్నాయి. 2024 ఎన్నికల్లోనూ ఇద్దరు టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గ్రూపు విభేదాలు మధ్య మరో వ్యక్తిని అవకాశం కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. కొత్తవారికిచ్చి ఇద్దరి మధ్యనున్న గ్రూపు విభేదాలకు పుల్‌స్టాప్ పెడుతారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
ఉమామహేశ్వరనాయుడుకి హ్యాండిచ్చి సురేంద్ర కు చాన్స్
ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్చన్ అధినేత సురేంద్ర పేరు ఇప్పుడు తెరపైకి వస్తోంది. గతంలోనూ ఇదే రకంగా సురేంద్రబాబుకు టిక్కెట్టు ఖరారైనట్టు ప్రచారం నడించింది. 2014 ఎన్నికల సమయంలో అనంతపురం అర్బన్ టిక్కెట్టు ఖరారైందని, ఆయన అనుయాయులు సంబరాలు కూడా జరుపుకున్నారు. చివరి నిమిషంలో మార్పు జరిగి ప్రభాకర్ చౌదరికి కేటాయించారు. దీంతో ఆయన అనుయాయుల్లో తీవ్రమైన నిరాశ ఎదురైంది. 2019లోనూ ఆశించినప్పటికీ అధిష్టానం టిక్కెట్టు ఖరారు చేయలేదు. ఇప్పుడు మరోమారు ఆయన పేరు తెరపైకి వస్తోంది. అయితే పార్టీ నుంచి అటువంటి సంకేతాలొచ్చాయా.. లేదా.. అన్నది మాత్రం స్పష్టత లేదు. సురేంద్రబాబు ప్రతిసారీ టిక్కెట్టు ఖరారవుతున్నట్టు ప్రచారం జరగడం చివరి నిమిషంలో వాయిదాపడటం జరుగుతూ వస్తోంది.
ఎవరికి టిక్కెట్ ఇచ్చినా టీడీపీ నేతలు ఓడిస్తారు !
2009 ఎన్నికల్లో నుంచి ఇదే రకంగా జరుగుతోంది. 2009 సంవత్సరంలో ప్రజారాజ్యాం పార్టీ టిక్కెట్టు ఆశించారు. అనంతపురం అర్బన్ టిక్కెట్టు ఖరారైనట్టు ప్రచారం నడిచి, చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై ఆ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధికారికంగా ఏ పార్టీలో చేరనప్పటికీ టిడిపికి అనుకూలంగా ఉంటూ వచ్చారు. ఇక్కడ కూడా ఎన్నికల ప్రతిసారీ పేరు వినిపించడం వాయిదాపడటం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ముగ్గురిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరో ఇద్దరు కలిసి అభ్యర్థిని ఓడించడం ఖాయమని ఆ పార్టీలోనే సెటైర్లు పడుతున్నాయి.