గుడివాడ నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేయడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారు. గుడివాడ టీడీపీ నాయకులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ఓ కొలిక్కి రాలేదు. చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న రావి వెంకటేశ్వరరావు, ఎన్నారై వెనిగండ్ల రాము మధ్య టిక్కెట్ పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు.
గుడివాడలో పాతుకుపోయి నాని
గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి కొడాలి నాని ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009లో టీడీపీ టికెట్‌పై గెలుపొందిన నాని 2014, 2019లో వైసీపీ టికెట్‌పై గెలిచారు. 2019లో మంత్రి కూడా అయ్యారు. 2019లో నానిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో దేవినేని అవినాశ్‌ను గుడివాడ నుంచి టీడీపీ అధిష్ఠానం బరిలో దింపింది. అయినా నానినే గెలిచారు. ఇప్పుడు ఆయన కూడా వైసీపీలో చేరారు. మంత్రిగా ఉన్న సమయంలో నాని ఆర్థికంగా బాగా బలపడ్డారు. ఆయన్ను ఢీకొనాలంటే టీడీపీ నుంచి కూడా ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థి బరిలో ఉండాలని టీడీపీ అనుకుంటోంది.
రావి, వెనిగండ్ల పోటీ
వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు కలిసి గుడివాడలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ ఎక్కువ అయింది. ఎవిరికి వారే విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రావి వెంకటేశ్వరరావుకు అన్యాయం జరిగిందని, ఈసారి ఆయనకు పార్టీ తప్పకుండా న్యాయం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు చంద్రబాబును కోరుతున్నారు. గుడివాడకే చెందిన వెనిగండ్ల రాము ఎన్నారై. ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టుకుని పని చేస్తున్నారు. కేశినేని శివనాథ్ తో కలిసి రాజకీయంగా ముందడుగు వేస్తున్నారు .
కుల సమీకరణాలతో వెనిగండ్ల వైపు మొగ్గు ?
గుడివాడ నియోజకవర్గంలో సుమారు 1.80 లక్షల ఓటర్లు ఉండగా ఎస్సీ, బీసీ, కాపులు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. రాము సతీమణి దళిత సామాజికవర్గానికి చెందిన వారు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు సైతం ఈసారి ఎలాగైనా పోటీలో నిలవాలన్న లక్ష్యంతో ఉన్నారు. అందుకే హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.