చంద్రబాబు, జయలలిత, కరుణానిధి అరెస్టులో సారూప్యత

టీడీపీ అధినేత, సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆయన్ను నంద్యాల నుంచి కారులో విజయవాడ తరలించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద అరెస్టు చేసినట్లు ప్రకటించినా అరెస్టు సమయంలో మాత్రం కేసు విషయం స్పష్టంగా చెప్పలేదు. కోర్టులో హాజరు పరిచిన తర్వాతే అన్ని విషయాలు వెల్లడిస్తామని ఏపీ పోలీసు శాఖ (సీఐడీ) ప్రకటించింది.

అర్థరాత్రి పోలీసుల హల్ చల్…

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసినట్లు తొలుత భావించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును, ఆయన కుమారుడిని అదే కేసులో అరెస్టు చేయడం వల ఆ విధంగా భావించాల్సి వచ్చింది. అది నిజం కూడా కావచ్చు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. కాకపోతే ఐటీ నోటుసులు సహా చంద్రబాబుపై ఐదారు కేసులున్నాయి. అందులోనూ అంగళ్లు, పుంగనూరులో ఘర్షణలకు సంబంధించిన కేసులో అరెస్టు చేస్తారని రెండుమూడు రోజులుగా టీడీపీ ఎదురు చూసింది. తొలుత ఒక కేసులో అరెస్టు చేసిన తర్వాత వేరే కేసుల్లో అరెస్టు చూపడం కూడా కొన్ని సందర్భాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని చంద్రబాబు ముందే జోస్యం చెప్పారు. అయితే శుక్రవారం రాత్రి అరెస్టు చేస్తే శని, ఆదివారాలు కోర్టు ఉండదు కాబట్టి కొన్ని రోజులు బెయిల్ రాకుండా జైల్లో ఉంచే అవకాశం కలుగుతుందన్న పాత సంప్రదాయాన్నే జగన్ సర్కారు పాటించిందని చెప్పాలి. పైగా రాత్రి పొద్దుపోయాక పోలీసులు హల్ చల్ చేశారు. తెల్లవారఝూము 3 గంటల నుంచి వాతావారణం వేడెక్కింది.చంద్రబాబు రాత్రి నిద్రపోతున్న బస్సులోకి దూసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా టీడీపీ శ్రేణులు అడ్డుతగిలాయి. ఐనా పోలీసులు చంద్రబాబు నిద్రలేచే వరకు గందరగోళం సృష్టిస్తూనే ఉన్నారు. ఒక పెద్ద నాయకుడిపై అర్థరాత్రి చర్యలు తీసుకోకూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ పోలీసులు దాన్ని బేఖాతరు చేశారు. చాలా తెలివిగా తెల్లారిన తర్వాత అరెస్టు చూపారు. ఈ లోపు కార్యకర్తలు అడ్డుపడకుండా వారిని పోలీసు స్టేషన్ కు తరలించారు.

1990ల్లో తమిళనాడు పరిస్థితి – జయలలిత అరెస్టు

రాజకీయ నాయకులపై కక్షసాధింపులు, అవినీతి కేసులు, అరెస్టులు కొత్తేమీ కాదు.మనదేశంలోనే చాలా చోట్ల ఇలా జరిగింది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య జరిగే రాజకీయాల్లో అరెస్టులు మామూలుగా జరిగిపోతాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఓడిపోయిన తర్వాత కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఆమెపై ఏడు కేసులు పెట్టింది. అందులో ఆదాయ వనరులకు మించి ఆస్తులున్న కేసులున్నాయి. జయలలితకు సుప్రీం కోర్టు కూడా బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో 1996 డిసెంబరు 7న ఆమెను అరెస్టు చేశారు. అప్పుడు కూడా అర్థరాత్రి తర్వాత పోలీస్ యాక్షన్ మొదలైంది.వందలాది మంది పోలీసులు చెన్నైలోని ఆమె పోయెస్ గార్డెన్ నివాసం ముందు మోహరించి హల్ చల్ చేశారు. అనేక చోట్ల తెల్లవారుఝామునే అన్నాడీఎంకే కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. చివరకు తెల్లవారుతుండగానే జయలలితను పోలీసు వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్లారు. కనీసం కారులో కూడా పట్టుకెళ్లలేదు. 28 రోజుల జైలు జీవితం తర్వాత జయలలితకు బెయిల్ లభించింది. చంద్రబాబు కేసు తరహాలో అది కూడా అర్థరాత్రి డ్రామానే భావించాలి.

అర్థరాత్రి కరుణానిధి అరెస్టు

నన్ను అరెస్టు చేస్తే నిన్ను వదులుతానా అని జయలలిత కక్ష పెంచుకున్నారు. 2001లో తిరిగి అధికారానికి వచ్చిన వెంటనే ఆమె అన్ని ఫైళ్లు దుమ్ముదులిపారు. కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ పై చెన్నై ఫ్లై ఓవర్ స్కాం నమోదు చేశారు. 2001 జూన్ 30న అర్థరాత్రి కరుణానిధి నివాసానికి వెళ్లిన పోలీసు బృందాలు తలుపులు పగులగొట్టి మరీ అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ప్రతిఘటించేందుకు కరుణానిధి ప్రయత్నించగా…ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇదీ చరిత్రలో మాయని మచ్చగానే భావించారు. ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్లడమేంటన్న చర్చ ఢిల్లీ స్థాయిలో జరగడంతో కేంద్రమూ, అప్పటి ప్రధాని వాజ్ పేయి కూడా సీరియస్ అయ్యారు. బెయిల్ తీసుకునేందుకు కరుణానిధి నిరాకరించడంలో ప్రభుత్వం ఆయన్ను బేషరతుగా విడుదల చేయక తప్పలేదు…