విజయం కోసం అడ్డదారులు తొక్కొచ్చు అని చెప్పిన చాణక్యుడు – కానీ..కండిషన్స్ అప్లై!

ఓడిన వాడిని ప్రపంచం మరిచిపోతుంది కేవలం విజేతను మాత్రమే గుర్తుపెట్టుకుంటుందంటాడు ఆచార్య చాణక్యుడు. అయితే గెలుపు అన్నివేళలా సక్రమ మార్గంలోనే సాధ్యం కాదు..కొన్నిసార్లు అడ్డదారిలో వెళ్లైనా కానీ గెలిచి చూపించాలన్నాడు చాణక్యుడు.

చరిత్రలో చాణక్యుజు స్థానం విశిష్టమైనది. అంత తెలివైన వ్యక్తిని ఆ తర్వాత మళ్లీ చరిత్ర చూడలేదు…మళ్లీ చూడడం కూడా సాధ్యం కాదేమో. ఎత్తుకు పైఎత్తు వేసి ప్రత్యర్థిని చిత్తుచేయగల సమర్థత చాణక్యుడి సొంతం.గెలుపే మనమెవరో చెబుతుందన్న చాణక్యుడు..విజయం కోసం అడ్డదారులు తొక్కినా తప్పులేదన్నాడు. కానీ ఎంచుకున్న మార్గం ద్వారా ఇతరులకు ఎలాంటి హాని కలగకూడదని స్పష్టం చేశాడు. అయితే అడ్డదారిలో అన్నమాటకి కండిషన్స్ అప్లై అన్నాడు చాణక్యుడు.

ఆలోచనలో వ్యత్యాసం
మీరు చూసే, మాట్లాడే, వినే పద్ధతి, ధోరణి అందరిలా కాకుండా వ్యత్యాసంగా వుండాలి. అప్పుడే గెలుపు సాధ్యం అవుతుందన్నాడు చాణక్యుడు. ఏదైనా జరిగినప్పుడు జరిగిన విషయంపై కాకుండా తిరిగి సక్సెస్ వైపు ఎలా అడుగేయగలమో ఆలోచించాలి.

ఒకరి కళ్లలో ఆనందం కోసం కాదు
ఇతరుల కళ్లలో ఆనందం కోసం మీరు పాకులాడాల్సిన అవసరం లేదు. అలాగని పక్కనవాళ్లకి హాని చేయమన్నది చాణక్యుడి ఉద్దేశం కాదు. మీకోసం ముందు మీరు ఆలోచించుకోవాలి. ఇతరుల సంతోషం కోసం బతికేవారిని ఈ లోకం పక్కనపెట్టేస్తుందని గ్రహించాలి.

డబ్బు విలువ గుర్తించాలి
డబ్బుకి మీరు విలువనిస్తే ఆ డబ్బు మీ దగ్గరుంటుందని స్పష్టంగా చెప్పాడు చామక్యుడు. ధనానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి. డబ్బుని బట్టి విలువనిచ్చే ఈ రోజుల్లో మీ చేతుల్లో ధనం లేకపోయినా ఉన్నట్లు ఓ మాయను సృష్టించాలి. అలా చేస్తేనే గౌరవం దక్కుతుంది.

విజయానికి సరైన దూరంలో చేరుకోవాలి
విజయానికి దగ్గరగా అంటారు దూరంగా అంటారు మరి సరైన దూరం అంటే ఏంటనే సందేహం వచ్చిందా… నిజమే.. కానీ ఇక్కడ చాణక్యుడి ఉద్దేశం ఏంటంటే నిప్పులకు దగ్గరగా వెళితే కాల్చేస్తాయి-దూరంగా ఉంటే సెగ తగలదు..సరైన దూరంలో పాత్ర ఉన్నప్పుడే ఆహారం సిద్ధమవుతుంది. అలా గెలుపుదిశగా సరైన దూరంలో ప్రయాణిస్తేనే విజయతీరాలకు చేరుకుంటారు.

పోయినదానిగురించి ఆలోచించకూడదు
కోల్పోయిన ఆస్తిని తలుచుకుని ఆవేదన చెందకూడదు. గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకూడదు…ఎందుకంటే పోయిన దానిగురించి ఆలోచించి ప్రస్తుత ఆలోచనను చంపేసుకోవడం బలహీనులు చేసేపని అంటాడు చాణక్యుడు. గతంలో జరిగిన అనుభవాలతో పాఠాలు నేర్చుకోవాలి కానీ ప్రస్తుత కాలాన్ని వృధా చేయకూడదు.

బలహీనతను కనిపించనీయకూడదు
ఆపదను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి కానీ సమస్యను చూసి పారిపోకూడదు. ముఖ్యంగా మీలో ఉన్న భయం, బలహీనత, కష్టం ఎప్పటికీ ముఖంలో కనిపించనీయకూడదు. మీ బలహీనత బయటపడితే ఎదుటివారి బలం పెరుగుతుంది.

బలహీనుడిని చులకనగా చూడొద్దు
బలహీనులను చులకనగా చూడకూడదు. శత్రువులు బలహీనులైతే అది మీకు చాలా ప్రమాదం. ఎందుకంటే వారిని మీరు పెద్దగా పట్టించుకోవడం మానేస్తారు..కానీ..వారు మాత్రం మిమ్మల్ని దెబ్బకొట్టే ప్రతి సందర్భాన్ని వినియోగించుకునే ప్రయత్నాల్లో ఉంటారు.

ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి
ఏపని మొదలెట్టినా మూడు ప్రశ్నలు వేసుకోవాలి. 1. నేనేం చేయాలి. 2. చేసే పనికి ప్రతిఫలం ఏంటి 3. నేను చేసే కార్యానికి విలువెంత.. వీటికి మీ దగ్గర సమాధానం ఉంటే విజయం మీ సొంతం అవుతుందని బోధించాడు ఆచార్య చాణక్యుడు