ఏపీలో కేంద్ర ప్రాజెక్టులు జిగేల్ – మీడియా ఎందుకు చెప్పదు ?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేసింది. అభివృద్ధి పేరుతో చేసే అప్పులు కూడా పూర్తి స్థాయిలో బటన్ నొక్కుడు పథకాలకే వినియోగిస్తోంది. అందుకే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కూడా వేయలేకపోపోతోంది. కానీ ఏపీలో కొన్ని అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. నేషనల్ హైవేలు, రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇతర కేంద్ర సంబంధ ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. కానీ వీటిపై ఎక్కడా తెలుగు మీడియాలో కనీస ప్రచారం రావడం లేదు. అందుకే ప్రజలకు తెలియడం లేదు.

వేల కోట్ల తో జాతీయ రహదారుల నిర్మాణం !

ఏపీలో జాతీయ రహదారులు మిల మిల మెరిసిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ది సంస్ధ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌లను కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గత ఏడాది ప్రారంభించారు. అదే సమయంలో 31 జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు భూమి పూజ చేశారు. 741 కి.మీ. రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. పూర్తయిన రహదారులను ప్రారంభించారు. 2024 నాటికి కనీసం రూ. 3 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ కోసం వెచ్చిస్తామని గడ్కరి ప్రకటించారు. ఇందులో అత్యధిక పనులు ప్రారంభమై చురుగ్గా సాగుతున్నాయి. ఏపీలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నారు నాగ్‌పూర్ నుంచి విజయవాడ హైవేను రూ. 15 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఏపీలో ఇప్పుడు ఏ జాతీయ రహదారిపై ప్రయాణిచినా… ఎక్కడా గోతులు కనిపించవు. విస్తరణ పనులు జరుగుతూ ఉంటాయి. కానీ వీటిపై ఏ ఒక్క మీడియా ప్రచారం కల్పించడం లేదు.

పరుగులు పెడుతున్న రైల్వే ప్రాజెక్టులు

రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో పరుగులు పెడుతున్నాయి. నడికుడి – శ్రీకాళహస్తి కొత్త లైన్‌కు పదిహేను వందల కోట్ల తో పనులు చేస్తున్నారు. కనీసం పాతిక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ ను వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం అక్కడి వారికి తప్ప బయటకు తెలియదు. ఎయిర్ పోర్టుల విషయంలోనూ కేంద్రం చురుగ్గా ఉంది. బోగాపురం ఎయిర్ పోర్టుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది.

రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయక అనేక సమస్యలు

నిజానికి కేంద్రం వేల కోట్లు కేటాయిస్తున్నా.. రాష్ట్రం కొన్ని ప్రాజెక్టుల విషయంలో మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటిదేమీ చేయకపోవడం వల్ల చాలా పనులు మందగించాయి. లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేంద్ర నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులే కనిపిస్తాయి. రాష్ట్ర నిర్వాకం వల్ల తాను అభివృద్ధి చేయదు..కేంద్రాన్ని చేయనివ్వదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

అభివృద్ధి పనులపై కనీస సమాచారం ప్రజలకు ఇవ్వరా ?

జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలకు సమాచారం చెప్పాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. అది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందనో.. లేకపోతే మరో పార్టీకి కోపం వస్తుందనో.. అభివృద్ధి పనుల గురించి సమాచారం లేకుండా చేయడం మీడియాకు తగని పని. దురదృష్టవశాత్తూ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితే ఉంది. కేంద్రం.. చేస్తున్న అభివృద్ధి గురించి కాకుండా రాజకీయ పార్టీలు కేంద్రం పై చేసే బేస్ లెస్ ఆరోపణలకు ప్రాధాన్యం ఇస్తూ.. బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు .దీని వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. మీడియాపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.