ఏపీ విద్యార్థులకు కేంద్రం వరం -కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్తగా దేశవ్యాప్తంగా 87 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఈనెల 20న జరిగిన సమావేశంలో అనుమతినివ్వగా అందులో ఎనిమిది ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్నాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలంలోని వలసపల్లె గ్రామంలో, శ్రీ సత్యసాయి జిల్లాలోని గొరంట్ల మండలం పాలసముద్రంలో, పల్నాడు జిల్లాలోని మాచర్ల మండంలోని తాళ్లపల్లి గ్రామంలో, కృష్ణా జిల్లాలోని నందిగామలో, పల్నాడు జిల్లాలోని నర్సారావుపేట డివిజన్‌లోని రొంపిచర్లలో, కృష్ణా జిల్లాలోని నూజివీడులో, నంద్యాల జిల్లాలోని డోన్‌లో మొత్తం 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

ఇప్పటికే స్థల సేకరణ పూర్తి త్వరలోనే తరగతులు

స్థలం, తరగతుల ప్రారంభానికి తాత్కాలిక వసతులు కల్పించేందుకు వచ్చిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆయా గ్రామాల పరిధిలో స్థల సేకరణ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులు వేలాది మంది సీబీఎస్ఈలో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిన భారత ప్రభుత్వం చొరవ పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. వీరితో పాటు సామాన్యులకు అవకాశం ఉంటుంది.

రిజర్వేషన్లు పోను ఆయా ప్రాంతాల వారికి అవకాశం

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్‌ పొందాలని చాలా మంది భావిస్తుంటారు. తమ చిన్నారులను ఈ విద్యాలయాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు సైతం ఆసక్తిచూపిస్తుంటారు. నామమాత్రపు ఫీజులతో సీబీఎస్‌ఈ సిలబస్‌ విద్యాబోధన, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం పేరెంట్స్‌ కేవీలవైపు ఆకర్షితులయ్యేందుకు కారణాలు చెప్పొచ్చు. ఇందులో 8వ తరగతి వరకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా ప్రయారిటీ కేటగిరీ ద్వారా ఆధారంగా ఎంపిక చేస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇక పదకొండో తరగతిలో చేరే వారిని పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఒకవేళ 10వ తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు.

ఇటీవలే గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాన

ఏపీకి కేంద్రం ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మంజూరు చేసింది. విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల నుంచి నిధులు వస్తున్నాయి ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లిష్‌, సోషియాలజీ, ట్రైబల్‌ స్టడీస్‌, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, బి.కామ్‌లో ఒకేషనల్‌ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఒకేషనల్‌, జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు