పీఎఫ్ఐపై కేంద్రం ఉక్కుపాదం

నిషేధిత ఉగ్రవాద సంస్థ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేంద్రం డిసైడైంది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, టెర్రర్ ఫండింగ్ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో గతేడాది పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐతో పాటు దాని ఎనిమిది అనుబంధ సంస్థలను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ సంస్థ సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ సైట్లను కూడా నిలిపివేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ పీఎఫ్ఐ అనుబంధ సంస్థలుంటే అక్కడ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాలిపోయింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన పలువురిని అరెస్టు చేసింది. ఈ ఏడాది మార్చి 17న 59 మంది పీఎఫ్ఐ నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

తాజాగా కేరళ కేంద్రం జప్తు

పీఎఫ్ఐకి కేరళ ఒకప్పుడు మంచి పట్టు ఉండేది. అక్కడ పది ఎకరాల స్థలంలో ఓ శిక్షణా కేంద్రాన్ని పీఎఫ్ఐ నిర్వహించేది. ఆయుధాల వినియోగం, బాంబుల తయారీ, దాడుల చేయాల్సిన తీరుపై అక్కడ ప్రత్యేకే ట్రైనింగ్ ఇచ్చేవారు. పీఎఫ్ఐ కార్యకర్తల రాకపోకలు అక్కడ ఎక్కువగా ఉండేవి. దాడులకు ప్లానింగ్ కూడా అక్కడ నుంచే జరిగేదిని గుర్తించారు. ఎన్ఐఏ ఇప్పుడా కేంద్రాన్ని జప్తు చేసి మూయించేసింది. ఎన్ఐఏ అటాచ్ చేసిన ఆరవ పీఎఫ్ఐ శిక్షణా కేంద్రం అది. పీఎఫ్ఐకి చెందిన మొత్తం 18 ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది.

అది పీఎఫ్ఐ సర్వీస్ వింగ్..

కేరళలో జప్తు చేసిన కేంద్రం పీఎఫ్ఐ సర్వీస్ వింగ్ అని ఎన్ఐఏ గుర్తించింది. కేరళలోని మంజేరీ ఈ కేంద్రం ఉంది.పేలుళ్లు సృష్టించే సామాగ్రి తయారీతో పాటు అక్కడ అనేక కార్యకలాపాలు నిర్వహించేవారు. గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ (జీవీఎఫ్) పేరుతో దీన్ని నడిపేవారు. హత్యలు సహా పలు నేరాలు చేసిన పీఎఫ్ఐ కేడర్ .. తర్వాత పోలీసులకు చిక్కకుండా దాక్కునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడేది. యువతను ఉగ్రవాదులుగా మార్చేందుకు ఇక్కడ బ్రెయిన్ వాష్ చేసే ప్రక్రియ కూడా జరిగేది. మతోన్మోదాన్ని రెచ్చగొట్టేందుకు అక్కడ తరగతులు నిర్వహించేవారు. విద్యాసంస్థల ముసుగులో అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవారు.

కేరళలోనే ఆరు కేంద్రాలు

కేరళలోనే మొత్తం ఆరు పీఎఫ్ఐ శిక్షణా కేంద్రాలపై ఎన్ఐఏ దాడులు జరిపి వాటిని మూయించేసింది. ఇప్పుడు మంజేరీతో పాటు గతంలో మలబార్ హౌస్, పెరియార్ వ్యాలీ, వల్లువనాడ్ హౌస్, కారుణ్య ఛారిటబుల్ ట్రస్ట్ , ట్రివేండ్ర ఎడ్యుకేషనల్ అండ్ సర్వీస్ ట్రస్ట్ (టెస్ట్)లను ఎన్ఐఏ ఖాళీ చేయించింది. సేవా సంస్థల పేరుతో పీఎఫ్ఐ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఎక్కడెక్కడ ఆయా కేంద్రాలున్నాయో గుర్తించడం కష్టంగా మారిందని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతీ చోట రెయిడ్స్ నిర్వహించి మూసేయిస్తున్నామని, వాటి నిర్వాహకులను అరెస్టు చేస్తున్నామని తెలిపారు. మరో పక్క పీఎఫ్ఐ చాలా తెలివిగా అద్దె భవానాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.