ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పార్టీ పరంగా లబ్ది కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వినియోగించుకుంటున్న అంశం రాజకీయవర్గాల్లోనే కాదు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఓ పార్టీ నేతగా మారి ఉండవచ్చు కానీ పార్టీలకు అతీతంగా కోట్లాది మందికి ఆరాధ్యుడు. అలాంటి మహనీయుడుకు సరైన గౌరవం ఇవ్వాలంటే రాజకీయ వాసనలు లేకుండా తటస్థంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ను తమ పార్టీకే పరిమితం చేస్తూ.. రాజకీయ భవిష్యత్ ప్రయోజనాల కోసం- అన్నట్లుగా ఉత్సవాల సభలు నిర్వహిస్తూండటంతో అనేక మంది దూరం అవుతున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన శత జయంతి ఉత్సవాలకు ప్రముఖులు ఎవరూ హాజరు కాకపోవడంతో ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు చాలా మంది హాజరు కాలేదు !
హైదరాబాద్లోని కైతలాపూర్ గ్రౌండ్లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు తెలుగుదేశం నేతలు చాలా మందిని పిలిచారు. దాదాపుగా టాలీవుడ్ అగ్ర హీరోలందర్నీ పిలిచారు. వారు వస్తున్నట్లుగా పోస్టర్లు వేశారు. ఎన్టీఆర్ కుటుంబం కూడా వస్తున్నట్లుగా చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లుగా ప్రచారం చేశారు. తీరా చూస్తే… వెంకటేష్, రామచరణ్, నాగచైతన్య తప్ప ప్రముఖు నటులు ఎవరూ హాజరు కాలేదు. చిన్న చితకా హీరోలను పిలిచి ఎన్టీఆర్ లెజెండ్ అనిపించారు. అయితే ఎక్కువ మంది ఎందుకు రాలేదంటే.. అందరికీ వచ్చే సమాధానం ఒకటే.అది తెలుగుదేశం కార్యక్రమంలా నిర్వహించడమే. పార్టీ కార్యక్రమాలకు ఎలా వెళ్తామని అనుకోవడమేనంటున్నారు.
పార్టీ కార్యక్రమాల్లా నిర్వహిస్తే ఎవరు వస్తారు ?
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పార్టీలకు అతీతంగా నిర్వహించాల్సి ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇది బలప్రదర్శనలుగా మార్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీల పెద్దలను హైదరాబాద్ సభకు పిలిచారు. గతంలో విజయవాడలో నిర్వహించిన సభలో రజనీకాంత్ రాజకీయ ప్రసంగం చేయడం వివాదాస్పదం అయింది. ఇక్కడ సభకు హాజరైతే టీడీపీ ముద్ర పడుతుందన్న కారణంగా ఎక్కువ మంది సెలబ్రిటీలు దూరంగా ఉన్నారు. చివరికి పవన్ కల్యాణ్ కూడా హాజరు కాకపోవడం అందుకేనంటున్నారు. అది టీడీపీ కార్యక్రమంలా నిర్వహిస్తే.. దానికి వెళ్తే.. తాము మద్దతుగా ఉన్నామన్న అభిప్రాయానికి వస్తారని.. అలాంటి ఇమేజ్ తమ మీద పడకూడదన్న ఉద్దేశంతోనే చాలా మంది ప్రముఖులు చివరి క్షణంలో డ్రాప్ అయ్యారని భావిస్తున్నారు.
ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు రాజకీయ రంగు !
ఎన్టీఆర్ను అందరి వాడిగా గుర్తించి అందర్నీ శత జయంతి ఉత్సవాల్లో భాగం చేయాలంటే.. రాజకీయానికి దూరంగా ఉంచాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకుండా స్వతంత్ర అభిమానుల కమిటీ ద్వారా వేడుకలు నిర్వహించాల్సి ఉంది. వేడుక్లలో ఎక్కడా రాజకీయ ప్రసంగాలు.. జెండాలు.. అజెండాలు లేకుండా చూసుకోవాల్సి ఉంది. అయితే ఉద్దేశపూర్వకంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారని అంటున్నారు. అందుకే రాజకీయ ముద్ర కోరుకోని జూనియర్ ఎన్టీఆర్.. తాత శత జయంతి ఉత్సవాలకు కూడా దూరమయ్యారన్న వాదన వినిపిస్తోంది.
అన్నీ రాజకీయంగా చూడకూడదని.. తమ పార్టీ మూలపురుషుడు అయినప్పటికీ ఆయనకు ఇతర పార్టీల్లోనూ అభిమానులు ఉంటారు కాబట్టి వారికోసైనా.. శతజయంతి ఉత్సవాలు తటస్థులతో నిర్వహించాల్సిందన్న అభిప్రాయం..నిఖార్సైన ఎన్టీఆర్ అభిమానుల్లో ఎక్కువగా వినిపిస్తోంది.