ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు, కల్వకుంట్ల కవిత విచారణ తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు మెరుపు వేగంతో కదులుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంతు వచ్చినట్లుందనిపిస్తోంది..
కేజ్రీవాల్‌కు శుక్రవారం సాయంత్రం సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదివారం ( ఏప్రిల్ 16) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించామని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలుగకూడదనే ఆదివారం విచారణకు పిలిచామని సీబీఐ అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ, కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వారి రిమాండ్ రిపోర్టులో కేజ్రీవాల్ పేరు పలు పర్యాయాలు ప్రస్తావనకు వచ్చింది. లిక్కర్ విధానాన్ని రద్దు చేయాల్సిన అనివార్యతలపై కూడా కేజ్రీవాల్‌ను ప్రశ్నించే వీలుంది. మనీష్ సిసోడియా సహా ఇతర నిందుతులను కేజ్రీవాల్‌కు ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి లేఖరాయడంతో సీబీఐ కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా సిసోదియా పేరును చేర్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ అంశం కూడా ఉండటంతో ఈడీ రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి సిసోడియా, మాగుంట రాఘవరెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్. శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై సహా పలువురు జైల్లో ఉన్నారు.
నిజానికి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఈ స్కాంలో కింగ్ పిన్‌గా రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రూ.100 కోట్ల ముడుపులు ఆమె కార్యాలయం, సహాయకుల ద్వారానే బట్వాడా జరిగిందని సీబీఐ, ఈడీ అనుమానిస్తున్నాయి. ప్రస్తుతానికి కవిత స్వల్ప అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి కేజ్రీవాల్ విచారణలో కవిత వ్యవహారం ప్రస్తావనకు వస్తుందో రాదో చూడాలి…