క్వాష్ ఫర్ ఓట్స్ స్కామ్ సంగతి చాలా సార్లు విన్నాం. సామాన్య ఓటర్ల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరూ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తుంటారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాంటి స్కామ్ లో ఇరుక్కుని ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు క్యాష్ ఫర్ క్వశ్చన్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. అంటే చట్ట సభల్లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగటమన్నమాట. పశ్చిమ బెంగాల్ ఎంపీ ఒకరిపై అలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆ మహిళా ఎంపీ తనకేమీ తెలియదని చెప్పినా నమ్మబుద్ధి కావడం లేదన్న వాదన వినిపిస్తోంది….
బీజేపీ ఎంపీ ఆరోపణలు
లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్రమైన ఆరోపణ చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరనందాని నుంచి నగదు, బహుమతుల రూపంలో లంచాలు తీసుకున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకొని, అమెను సస్పెండ్ చేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. బీజేపీకి సన్నిహితుడని భావిస్తున్న గౌతం అదానీకి, హీరనందానికి మధ్య వ్యాపారంలో పోటీ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఏకంగా 50 ప్రశ్నలు
2019-23 మధ్య మహువా మొయిత్రా 61 ప్రశ్నలు వేయగా, అందులో 50 ప్రశ్నలు హీరనందానికి సంబంధించనవేనని దూబే తెలిపారు. హీరనందాని గ్రూపు ఇంధనం, ఇఫ్రా రంగాల కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూపుతో పోటీ పడినా వాటిని దక్కించుకోలేకపోయింది. దాంతోనే అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకొని ఈ ప్రశ్నలు వేశారని ఆరోపించారు. ఇందుకోసం హీరనందాని ఆమెకు రూ. 2 కోట్ల నగదుతో పాటు ఒక ఐ ఫోన్ కూడా కొనిచ్చారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొయిత్రా ఎన్నికల వ్యయానికి మరో రూ. 75 లక్షలు సమకూర్చారని కూడా చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను చాలా నిజాయతీగా ఉంటానని చెబుతారు. ఆమె పార్టీ వారు మాత్రం అవినీతికి ఆలవాలంగా మారారు. గతంలో కూడా ఆమె పార్టీ ఎంపీలు క్యాష్ ఫర్ ఓట్స్ స్కామ్ లో చిక్కుకున్నారు.
విచారణకు సిద్ధమంటున్న మొయిత్రా
బీజేపీ నేతలు మొయిత్రా సస్పెన్షన్ ను కోరుతుండగా… తాను సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే జై ఆనంద్ దేహాద్రి అనే అడ్వకేట్ సుదీర్ఘ పరిశోధన చేసి మొయిత్రా అవినీతిని బయటపెట్టారు. దీనిపై ఆయన సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. లోక్ సభలో ఆమె పారాదీప్ పోర్టు, దర్మా ఓడరేవు, యూరియా సబ్సిడీ, రియల్ ఎస్టేట్ పై స్టీలు ధరల ప్రభావం లాంటి ప్రశ్నలే అడిగారు ఇవన్నీ కూడా అదానీ గ్రూపుకు, దర్శన్ హీరనందానికి మధ్య వివాదాల్లో నలుగుతున్నవే కావడం విశేషం. ఏదమైనా బీజేపీ, తృణమూల్ మధ్య మాటల తూటాలు పేలడానికి ఈ వ్యవహారం ఆజ్యం పోసిందనే అనుకోవాలి.