తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా మార్చి.. జాతీయ స్థాయికి వెళ్లనని చెప్పుకుంటున్న కేసీఆర్ చివరికి జయప్రద లాంటి రిటైర్డ్ పొలిటిషియన్లను నమ్ముకోవాల్సి వస్తోంది. బీఆర్ఎస్ అని పేరు పెట్టారు కానీ..ఆయన మహారాష్ట్రలో ఓ వైపు మాత్రమే రాజకీయం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో… కానీ.. అక్కడ నేతల్ని తీసుకొచ్చి ఇక్కడే కండువాలు కప్పుతున్నారు. కానీ అక్కడ పోటీ చేయడానికి మాత్రం ఇక్కడి నేతల్నే తీసుకెళ్తున్నారు. తాజాగా జయప్రదను మహారాష్ట్రలో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదో ఓ రాజకీయ పార్టీ అని ఎదురుచూస్తున్న జయప్రదకు ఈ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు.
రాజకీయ పునరావాసం కోసం చూస్తున్న జయప్రద
జయప్రద బీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆమెను ఏపీ నుంచో.. తెలంగాణ నుంచో కాకుండా.. మహారాష్ట్ర నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మహారాష్ట్ర, తెలంగాణల్లో అన్ని పార్లమెంట్ సీట్లు గెల్చుకుంటే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టకుండా ఒక్క మహారాష్ట్రపైనే వ్యూహాలు పన్నుతున్నారు. గతంలోనూ ఆమె కేసీఆర్ పార్టీ ద్వారా ఏపీ లోని రాజమండ్రి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ మారిన కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఏపీలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. అందుకే.. ఆమెను మహారాష్ట్రలో పోటీ పెట్టాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
మహారాష్ట్రను కేసీఆర్ అవమానిస్తున్నారా ?
జయప్రద దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటి మాత్రమే కాదు రాజకీయ నాయకురాలు కూడా. టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ… తర్వాత ఆమె సమాజ్ వాదీ పార్టీలోనే ఎక్కువ కాలం ఉన్నారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అమర్ సింగ్ ఆమెకు రాజకీయ గురువుగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడింది. ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. చాలా పార్టీల్లో చేరుతారన్న ప్రచారం జరిగింది కానీ ఎక్కడా చేరలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున మహారాష్ట్రలో పోటీ చేసే చాన్స్ కేసీఆర్ ఇస్తున్నారు. మహారాష్ట్రలోనూ జయప్రదకు గుర్తింపు ఉంది. రాజకీయ నాయకురాలిగానూ గుర్తిస్తారు. అయితే… మహారాష్ట్రలో ఇలా స్థానికేతర అభ్యర్థుల్ని అక్కడి ప్రజలు పరిగణలోకి తీసుకుంటారా అన్నది డౌటే. తమ రాష్ట్రంలో ఎవరూ లేనట్లు బయట వాళ్లను తెచ్చి పోటీ చేయించడం ఏమిటని అక్కడి వారు భావిస్తే మొదటికే మోసం వస్తుంది.
మహారాష్ట్రలో కేసీఆర్ రాజకీయాలు ఎవరి కోసం ?
తెలంగాణ ప్రజలు పన్నులుగా కడుతున్న సొమ్మును పెద్ద ఎత్తున కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారు. పార్టీలో చేరికలన్నీ ఆర్థిక కోణాల్లో జరుగుతున్నాయని చెబుతున్నారు అయితే కేసీఆర్ ఇంత ఎక్కువగా ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. ఒక్క సీటు గెలిచే చాన్స్ లేదు కానీ ఓట్లు చీల్చే వ్యూహం మాత్రం అమలు చేస్తున్నారని చెబుతున్నారు