పెరుగు తినడం చాలామందికి అలవాటు. పెరుగు తినకుండా భోజనం సంపూర్ణం అయిందని అనుకోరు. ఎన్నో పోషకాలుండే పెరుగు ఆరోగ్యానికి చాలామంచిదే కానీ…వాతావరణంలో మార్పులొచ్చినప్పుడు, కాలానుగుణంగా.. పెరుగుకి దూరంగా ఉండాలా? ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉండేటప్పుడు పెరుగు తినకపోవడమే మంచిదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు..
పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి 12 సహా మీ ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్ని ఉంటాయి. పెరుగులో కొవ్వు అధికంగా ఉంటుంది. కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను కూడా బలపరుస్తుంది. పెరుగు మంచి ఎనర్జీ బూస్టర్. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి పెరుగు ఉపయోగపడుతుంది. హెయిర్ ఫోలికల్స్ నుంచి చర్మాన్ని మృదువుగా చేయడానికి పెరుగును ఉపయోగిస్తారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వానాకాలంలో పెరుగు తినడం వల్ల పిత్త, కఫ, వాత దోషాలని ఒకేసారి ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు
@ చల్లటి వాతావరణంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. అందుకే పెరుగులో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు లేదా తేనె జోడించుకుని తింటే మంచిది. ఇది శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
@ వర్షాకాలంలో రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో శ్లేష్మం అభివృద్ధి చెందుతుంది. ఇది జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. వాతావరణంలో తేమ కారణంగా అలర్జీ ప్రమాదాన్ని పెంచుతుంది
@ ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
@ పెరుగు తినడం అలవాటనే ఉద్దేశంతో అతిగా తినేవారూ ఉన్నారు. పెరుగు…తలలో నొప్పి, మైగ్రేన్ ని ప్రేరేపించే ఆహారం. బయోజెనిక్ అమైన్ వల్ల ఇలా జరుగుతుంది. ఈ అమైన్ లు నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి రక్తప్రసరణ తగ్గిస్తాయి లేదంటే పెంచుతాయి. దీని వల్ల తలనొప్పి వస్తుంది.
అయితే పెరుగుతింటే సమస్య అని పూర్తిగా మానెయ్యడం కూడా అనారోగ్యమే. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తినకూడదు. వానాకాలం, చలికాలంలో పగటి పూట పెరుగుతింటే పెద్దగా సమస్యలుండవు. పైగా గడ్డలాంటి పెరుగు, ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు కాకుండా కొంచెం పల్చగా మజ్జిగలా వేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.