అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడపురాణాన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు తన సారథి అయిన గరుత్మంతునికి ఉపదేశించగా, వేదవ్యాసుడు రచించారు. అయితే గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా…ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలా ఎప్పుడైనా చదవొచ్చా అనే సందేహాలుంటాయి. కానీ ఆ సందేహాలు అవసరం లేదన్న పండితులు..ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు..ఎప్పుడైనా చదవొచ్చని చెబుతున్నారు.
గరుడ పురాణంలో మూడు భాగాలున్నాయి
- ఆచారకాండ ( కర్మకాండ) -240 అధ్యాయాలు
- ప్రేతకాండ ( ధర్మకాండ) -50 అధ్యాయాలు
- బ్రహ్మకాండ( మోక్షకాండ) – 30 అధ్యాయాలు
ఇహలోకంలో ధర్మంగా ఉండి పరలోకంలో పరమాగతి పొందమని చెబుతోంది గరుడ పురాణం. లేదంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని బోధిస్తోంది. వాస్తవానికి గరుడపురాణం చనిపోయిన వారి ఆత్మ శాంతికోసం మాత్రమే కాదు…అందరూ చదవాల్సిన గ్రంథం. ఇది చదివితే తప్పకుండా పాపభీతి కలుగుతుంది. పైగా గరుడపురాణం చదివితే పితృదేవతలు కూడా అదృశ్యరూపంలో వచ్చి వింటారట. ఈ పురాణంలో యముడు ప్రధాన దేవత. మన పాపపుణ్యాల వివరాలన్నిటినీ చిత్రగుప్తుని ద్వారా తెలిసుకుని తగిన శిక్షలు విధిస్తాడు. కేవలం భౌతికంగా చేసిన పాపాలు మాత్రమే కాదు, మానసికంగా చేసిన పాపాలు కూడా ఇందులో లెక్కలు కడతారు. శిక్షలన్నీ అనుభవించిన తర్వాత స్వచ్ఛమైన ప్రకాశంతో ఆత్మ పరమాత్మలో లీనం కావడమో మరుజన్మ లభించడమో జరుగుతుంది.
మనిషిగా పుట్టడం వరం – శాపంగా మార్చుకోవద్దు
మనిషిగా పుట్టడం ఓ వరం. ఈ వరాన్ని శాపంగా మార్చుకోవద్దని చెబుతుంది గరుడపురాణం. అయితే అసలు విషయాన్ని వదిలేసి గరుడ పురాణం ఇంట్లో ఏదో జరిగిపోతుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దంటున్నారు పండితులు. గరుడ పురాణంలో ధర్మం, మరణం, నరక ప్రయాణం, వైతరణి వర్ణన, నరక బాధలు, దారిలో వచ్చే మృత్యుపట్టణాలు, కర్మరాహిత్య ఫలితాలూ, దానాల వివరణ సహా ఇంకా చాలా భక్తి విధానాలుంటాయి. అందుకే ఈ పురాణ గ్రంధాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు..నిత్యం చదువుకోవచ్చు.
ఆత్మకు మోక్షాన్నిచ్చేదే గరుడ పురాణం
మరణించిన ఆత్మకు తర్పణం చేసిన తర్వాత కూడా, కొన్నిసార్లు ఆత్మలు విముక్తి లేకుండా తిరుగుతాయి. ఇలాంటి సమయంలో గరుడ పురాణం లోకం నుంచి వెళ్లిపోయిన ఆత్మకు ముక్తి లేదా మోక్షాన్ని ఇవ్వడానికి పఠిస్తారు. మరణించిన వ్యక్తి తన ప్రియమైనవారితో 13 రోజులు ఉంటాడు. ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే స్వర్గం, నరకం, మోక్షం, పాతాళం, పతనం గురించి మృతుడికి తెలుస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. పూర్తి సమాచారం కోసం అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించగలరు.