కాంగ్రెస్ పార్టీకి బలాల కంటే బలహీనతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ పరపతి నానాటికి తీసిబొట్టు నాగం బొట్టు అన్నట్లుగా తయారైంది. మిత్రపక్షాలను వెదుక్కునేందుకు కాంగ్రెస్ పార్టీ నానాతంటాలు పడుతుంటే..పొత్తు భాగస్వాములుగా ఉండాల్సిన వాళ్లు పారిపోతున్నారు. కాంగ్రెస్ పేరు చెబితేనే పరుగులు పెడుతున్నారు. మీతో పొత్తు మాకు వద్దు బాబు అని దణ్ణం పెడుతున్నారు.
ఆ పార్టీకి సీన్ లేదంటున్న మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద బాంబు పేల్చారు. కాంగ్రెస్ ను పూచికపుల్లతో సమానంగా తీసిపడేశారు. బెంగాల్ లో కాదు..దమ్ముంటే హిందీకి గుండెకాయ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని ఆమె సవాలు చేశారు.ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలమెంతో చూపించాలని ఆమె సవాలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 300 స్థానాల్లో పోటీ చేయాలని ఆమె సూచించారు. ఆ మాట చెబితే వినేందుకు వాళ్లు సిద్ధంగా లేరని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రాకపోవచ్చని, ఆ పార్టీ బలమూ, సమర్థతపై తనకు అనుమానాలు ఉన్నాయని మమత చెప్పుకున్నారు.
విభజించి పాలించే తత్వమున్న పార్టీ….
కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతింటున్నప్పటికీ తన పాత పద్ధతులను మాత్రం మానుకోలేకపోతోంది. రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పొత్తు ధర్మం అంటూనే మిత్రపక్షాలను దెబ్బకొట్టేందుకు ప్లాన్ వేస్తోంది. ముస్లిం ఓట్లు బీజేపీకి వ్యతిరేకమని భావిస్తూ వారిని హిందూవర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అదేమంటే తాము మాత్రమే మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తామని చెప్పుకుంటోంది. మిత్రపక్షాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోగుట్టు అర్థం చేసుకున్నాయి. బెంగాలో లో మత చిచ్చు పెట్టేందుకే రాహుల్ రంగంలోకి దిగారని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ ను వదిలించుకునేందుకు మమత డిసైడయ్యారు. 42 లోక్ సభా స్థానాలున్న బెంగాల్ లో కాంగ్రెస్ కు కేవలం రెండు స్థానాలు కేటాయిస్తామని ప్రకటించారు. పైగా కాంగ్రెస్సే స్వయంగా పొత్తును వదులుకుందని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం తృణమూల్ ను పట్టుకు వేలాడేందుకే ప్రయత్నిస్తోంది. పొత్తు చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయని రాహుల్ చెప్పుకుంటున్నారు.
బీజేపీకి 400 సీట్లు దాటతాయన్న ఖర్గే….
కాంగ్రెస్ ఇప్పుడు అసంకల్పితంగానే బీజేపీ బలాన్ని అంగీకరిస్తోంది. కమలం పార్టీకి 400 లోక్ సభా స్థానాలు వస్తాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ప్రకటించారు. రాజ్యసభలో ప్రధాని మోదీ సమక్షంలోనే మాట్లాడుతూ బీజేపీ ఇప్పటికే 300 సీట్లు దాటిందని, ఈ సారి ఎన్నికల్లో 400 దాటుతాయని అన్నారు. తర్వాత తడబడి అలా కాదు… బీజేపీ చెప్పుకుంటున్న విషయాన్ని తాను ప్రస్తావిస్తున్నానన్నారు. ఎంత తడబడినా నిజం నిజమే కదా.. అందుకే అన్యమనస్కంగానైనా ఖర్గే నిజాన్ని ఒప్పుకున్నారు..