టీడీపీ, జనసేన మధ్య పొత్తులు ఫలితం ఇచ్చే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. జనసేనాని ప్రకటించుకున్న రెండు సీట్లలో సహకరించేది లేదని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజానగరం నేతలు ఈ ప్రకటన చేసేశారు. అది టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గం అని .. జనసేనకు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారు.
జనసేనకు సహకరించేది లేదని క్యాజర్ ప్రకటన
రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని టిడిపి నాయకులు స్పష్టం చేశారు. జనసేన అధినేత తొందరపాటు నిర్ణయం వల్ల టిడిపికి నష్టం వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చంనాయుడుకు తేల్చి చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరికి వెళ్లి కోరుకొండ మాజీ జడ్పిటిసి సభ్యులు వెంకటరత్నం అప్పలనరసారావు, మాజీ ఎంపిపి నూకరత్నం, మండలం అధ్యక్షుడు గండి విజయకుమార్, ఎం.అప్పా రావు తదితరులు లేఖ ఇచ్చారు. ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణచౌదరి నాయకత్వంలో నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉందని ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని అంటున్నారు.
జనసేనకు కేటాయించడం తప్పంటున్న నేతలు
టీడీపీ గెలుపు ఖాయమనుకుంటున్న రాజానగరంలో టిక్కెట్‌ను జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు. నియోజకవర్గంలో జనసేనకు గెలిచే సత్తా లేదని ఇటువంటి తొందరపాటు నిర్ణయం వలన టిడిపి నాయకత్వం దెబ్బతింటుందని చెప్పారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా జనసేన పార్టీ మద్దతుగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. జనసేన గెలుపునకు సహకరించేది లేదని తెగేసి చెప్పారు.
టీడీపీ రా కదలిరా సభకు రాజానగరం శ్రేణులు దూరం
జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభకు రా కదలిరా సభకు కూడా రాజానగరం శ్రేణులు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో టిడిపి నాయకత్వానికి హైకమాండ్ బుజ్జగింపులు చేస్తోంది. రెండు పార్టీల అధినేతలు కలిసి నియోజకవర్గంలో అభ్యర్థుల వివరాలు ప్రకటించాల్సి ఉందని.. ముందు . పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సలహాలిస్తున్నారు. అయితే పరిస్థితిపై అవగాహనకు రావడంతో టీడీపీ క్యాడర్ వేరే దారులు చూసుకుంటున్నారు.