కాంగ్రెస్ అంటే అధికారం కోసం అర్రులుజాచి కూర్చోవడం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారం చేతిలో లేకపోతే ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టదు. ముద్ద దిగదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు ఖాయం. బహిరంగంగా తిట్టుకోవడం కొంతమంది వెళ్లిపోవడం కూడా అంతే ఖాయం. కొందరు తిరుగుబాట్లు చేస్తుంటే, మరికొందరు తిరుగుపాట్లు పడుతుంటారు.
పార్టీకి టాటా చెబుతున్న నేతలు
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి జాబితాలు ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నాయి. మొదటి జాబితాతోనే రాష్ట్రంలో ఆ పార్టీ నేతల అసలు రంగు బయటపడింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై పోటీకి పార్టీలో కొత్తవాడైన విక్రమ్ మస్తాన్ ను నిలబెట్టారన్న కోపంతో సంతోష్ శర్మ అనే నాయకుడు రాజీనామా చేశారు.నాగోడ్ నియోజకవర్గం టికెట్ కేటాయించలేదని యద్వేంద్ర సింగ్ అనే నాయకుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. మధ్యప్రదేశ్ పార్టీ మీడియా సెల్ ఉపాధ్యక్షుడు అజయ్ యాదవ్ కూడా వెళ్లిపోయారు. టికెట్ కేటాయించకుండా పార్టీ తనను అవమానపరిచిందని ఆయన ఆరోపించారు.
ఇదీ కాంగ్రెస్ నేతల తీరు..
కమల్ నాథ్, దిగ్విజయ్ పై ఆరోపణలు
మాజీ ముఖ్యమంత్రులు కమల్ నాత్, దిగ్విజయ్ సింగ్ లు కాంగ్రెస్ పార్టీని తమ జాగీరులా మార్చుకున్నారని కాంగ్రెస్ లో కొందరు నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు.పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా తమకు ఇష్టం వచ్చిన వారికి టికెట్లు పంచుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.దిగ్విజయ్ బంధువులందరికీ టికెట్లు కేటాయించేశారని, దానితో వేరే వారికి టికెట్లు రాలేదని మరికొందరి ఆరోపణ. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఢిల్లీ నుంచి సిఫార్సులు తెచ్చుకున్న వారికి, డబ్బులిచ్చిన వారికి టికెట్లి పంచారని కొందరంటున్నారు.
వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం
పార్టీని బలోపేతం చేసే దిశగా టికెట్ల బట్వాడా జరిగిందని దిగ్విజయ్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. 65 శాతం టికెట్లు యువతకు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. తానెప్పుడూ డబ్బుకు అమ్ముడుపోలేదని రాజీవ్ గాంధీ హయాంలోనే టికెట్ల పంపిణీ కమిటీకి చైర్మన్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నానని దిగ్విజయ్ చెప్పుకున్నా .. ఆయన మాటను పట్టించుకునే వాళ్లు కనిపించలేదు. 4 వేల మంది ఆశావహుల్లో 230 మందిని ఎంపిక చేయడం అంత సులభం కాదని దిగ్విజయ్ అంటున్నారు. సీనియర్ల నివేదికలు, జిల్లా యూనిట్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే టికెట్లు ఇచ్చామని దిగ్విజయ్ వివరణ ఇచ్చుకున్నారు. టికెట్లు రాని వారికి సంస్థాగత పదవులతో పాటు పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ శాంతించేందుకు రెబెల్స్ సిద్ధంగా లేరు. రేపు రాజు ఎవడో రెడ్డి ఎవడో తమకు తెలియదని ఇప్పుడు అన్యాయం చేసి తర్వాత న్యాయం చేస్తామని చెప్పడం కుదరదని వారు తేల్చేశారు. ఈ తిరుగుపాట్ల ప్రభావం ఎన్నికలపై ఖచితంగా ఉంటుందని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.