బీఆర్ఎస్ సర్కార్ మరో భారీ స్కాం – ఓఆర్ఆర్‌నీ రాసేసుకున్నారా?

తెలంగాణ సర్కార్ అవినీతి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ నేత రఘునందన్ రావు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ కాంట్రాక్ట్ విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని అడ్డంగా దోచేస్తోందని.. ఆయన కీలక వివరాల్ని బయట పెట్టారు. ఇప్పుడీ విషయాలు సంచలనంగా మారుతున్నాయి.

వేల కోట్ల ఖర్చుతో ఔటర్ నిర్మాణం

హైదరాబాద్ నగరానికి ఔటర్ నిర్మాణం ఓ వరంలా మారింది. ఆ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన తర్వాత నగరం విస్తరించింది. ఇప్పుడు ఆ ఔటర్ పై వాహనాలు పరుగులు పెడుతున్నాయి. అయితే ఉచితంగా కాదు. టోల్ ఫీజు కట్టాలి. ఇప్పుడు ఆ టోల్ ఫీజు వసూలు చేసుకునే అవకాశాన్ని ముఫ్పై ఏళ్లకు ఓ సంస్థకు కట్టబెట్టేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు… మళ్లీ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు కానీ ఏకంగా ముఫ్పై ఏళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అందుకే అందులో వివరాలన్నీ బయటకు లాగి అసలు విషయం బయట పెట్టారు రఘునందన్ రావ.ు

భారీ స్కాం జరిగిందా ?

ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్స్ ద్వారా రోజుకు సుమారుగా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే, తమ స్వలాభం కోసం హెచ్ ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్, కాంట్రాక్టు సంస్థతో చేతులు కలిపి, అత్యంత తక్కువ ధరకే ముఫై ఏళ్లపాటు టోల్ గేట్ సొమ్ము దండుకోమంటూ అప్పగించారని రఘునందన్ రావు ఆరోపించారు.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ నిర్వహణను రాబోయే మప్ఫై ఏళ్లపాటు ప్రవేటు సంస్దకు నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకు సిద్దమైన HMDA గత ఏడాది నవంబర్ 10వ తేదీన టెండర్లు పిలిచింది. 2023 మార్చి 31వ తేది వరకూ గడువునిచ్చింది. ఈ టెండర్లలో క్వాలిఫై అయిన నాలుగు కంపెనీలు ఐఆర్ బి ఇన్ప్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ 7,272 కోట్ల రూపాయలకు టెండర్ వేసి ఎల్ వన్ గా నిలిచింది. కానీ HMDA కమీషన్ అరవింద్ కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ఐఆర్ బి 7380 కోట్ల రూపాయలు కోట్ చేశారు. అదనంగా 108 కోట్ల రూపాయలు ఎవరు చెబితే కంపెనీ పెంచిందని ఆసక్తికరంగా మారింది.

ఆదాయం రోజుకు రెండు కోట్లు !

ఈ ఏప్రిల్ నెల సగటు టోల్ గేట్స్ నుండి వచ్చిన ఆదాయం రోజుకు కోటి ఎనభై ఐదు లక్షలు దాటింది. అంటే ఏడాదికి సుమారుగా 720 కోట్లు ఆదాయం వస్తోంది. ముఫై ఏళ్లపాటు లీజుకు ఇవ్వడమంటే సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మరి అంతలా ఆదాయం వస్తున్న ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్స్ లీజును అప్పనంగా ఓ కంపెనీకి కేవలం 7380 కోట్లకు 30 ఏళ్లపాటు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు రఘనందర్ రావు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టోల్ గేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రభుత్వమే టోల్ గేట్ లను నిర్వహించాలంటున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ నిర్వహణ ఒప్పందం ప్రక్రియ వెంటనే ఆపకపోతే కోర్టుకు వెళ్లి స్టే తెస్తామని హెచ్చరించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు. దీనిపై వివరణ ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపడం లేదు. ఇవ్వకపోతే కోర్టుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుంది.