భారత రాష్ట్ర సమితికేసీఆర్ తీరు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే ఫార్ములాను పాటిస్తున్నారు. నెల రోజుల కిందటి వరకూ ప్రధాని మోదీని వ్యక్తిగతంగా కూడా దూషిస్తూ యుద్ధం పేరుతో రాజకీయం చేసిన ఆయన ఇప్పుడు… బీజేపీ పేరు ఎత్తడం లేదు. మోదీని విమర్శించడం లేదు. పైగా తాను బీజేపీకి దగ్గర అని చెప్పుకునేలా.. ..బీజేపీకి వ్యతిరేకం కాదు అనే అభిప్రాయం వచ్చేలా సంకేతాలు పంపుతున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ తీరు చూసి… ఇదేం రాజకీయం అని విస్తుపోని వాళ్లు లేరు.
పట్నాతో విపక్షాల భేటీకి బీఆర్ఎస్ దూరం !
వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నామని కేసీఆర్ చాలా సార్లు ధీమాగా చెప్పారు. భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా నరేంద్రమోదీని మరోసారి ప్రధాని కాకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతో పట్నాలో పన్నెండో తేదీన సమావేశం అవుతున్నాయి. విపక్షాల ఐక్యను దేశ ప్రజల ముందు ఉంచడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామనుకున్న ప్రతి పార్టీ ఈ సమావేశానికి వెళ్తోంది. కానీ బీజేపీపై భీకర యుద్ధం ప్రకటించిన బీఆర్ఎస్ మాత్రం వెళ్లడం లేదు. దేశంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందని.. ఫెడరల్ ఫ్రంట్ పెడతానని దేశవ్యాప్తంగా తిరిగిన నేత కేసీఆర్. వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీకు ప్రత్యామ్నాయంగా మరో వేదిక ఉండాలని తన పార్టీ పేరుతో భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. కానీ ఇప్పుడు కేటీఆర్ అనూహ్యంగా మూడో ప్రత్యామ్నాయం లేదన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఆ సమావేశాలకు తాము వెళ్లడం లేదని చెబుతున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తిరిగినవన్నీ మర్చిపోయారా ?
బీజేపీని గద్దె దించాలన్సిందేనన్న లక్ష్యంతో కేసీఆర్ తన పార్టీని బీార్ఎస్ గా మార్చారు. తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ ట్విస్ట్ ఇవ్వడానికి చేయాల్సినదంతా చేశారు. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి సునాయసంగా గెలుస్తారని తెలిసినా మద్దతు ఇవ్వలేదు. విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పట్నుంచి నెల రోజుల కిందటి వరకూ కేసీఆర్ యుద్ధం చేసినట్లుగానే కనిపించారు. ఇతర పార్టీల నాయకులకూ అదే భావన కల్పించారు. తాను జాతీయ పార్టీ పెట్టేశానని ఇక విస్తృతంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తిరిగి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. కానీ ఏపీలో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికీ వెళ్లలేదు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రారంభించిన విషయం కూడా ఎవరికీ తెలియదు.
బీజేపీ చల్లని చూపు కోసమే అగచాట్లు !
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో ఏ మాత్రం లడాయి పెట్టుకోవాలన్న ఆలోచన కేసీఆర్ కు లేదని ఆయనపూర్తిగా మారిపోయారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉంది. ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణ అంటూ జరిగితే.. సాక్ష్యాలు బయట పెట్టిన కేసీఆర్ ను విచారణ జరపాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఆర్థికపరమన ఎన్నో అవకతవకల విషయంలో కేసీఆర్ కంగారు పడుతున్నారని.. ఇలాంటి సమయంలో బీజేపీతో పెట్టుకోవడం కన్నా సొంత రాష్ట్రంలో కుర్చీ కాపాడుకోవడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారని అంటున్నారు. అయితే బీజేపీపై యుద్ధం ఆపేసినంత మాత్రాన దర్యాప్తు సంస్థలు సైలెంట్ అవుతాయని అనుకోవడం అమాయకత్వమని అసలు విషయం ముందు ముందు తెలుస్తుందన్న సెటైర్లు బీజేపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి.