మహిళా గవర్నర్‌ను ఘోరం గా అవమానంచడమే కాకుండా ఆ విషయాన్ని కూడా తామే బయట పెడుతున్నారు భారత రాష్ట్ర సమితి నేతలు. ఇలాంటి సెల్ఫ్ గోల్స్ వారు మాత్రమే చేసుకోగలరు. తాజాగా మరో విషయంలో బీఆర్ఎస్ నేతలు.. గవర్నర్ పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రజల ముందు ఉంది. అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదు. అయితే ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు. పూర్తిగా మంత్రులు.. బీఆర్ఎస్ పార్టీ నేతల కోలాహలం మధ్యనే ఈ ప్రోగ్రాం జరిగింది. ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం పంపారు కానీ వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వెళ్లలేదు.
గవర్నర్ రాలేదంటూ జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు !
సెక్రటేరియట్ ప్రారంభం అయిన తర్వాత.. మంత్రి జగదీష్ రెడ్డి గవర్నర్ తమిళిసైపై విమర్శలు ప్రారంభించారు. గవర్నర్ సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ రాకపోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదని, దీని వల్ల గవర్నర్ నిజస్వరూపం బయటపడిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్దిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, గవర్నర్ రాకపోవడం కూడా అందులో భాగమేనని విమర్శించారు. ప్రతిపక్ష, విపక్ష పార్టీలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని జగదీష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధికి అడ్డుపడే వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ అసలు నిజం ఏమిటంటే గవర్నర్‌కు ప్రభుత్వం ఆహ్వానం కాదు కదా కనీస సమాచారం కూడా ఇవ్వలేదు.
పిలవలేదు సరి కదా.. రాలేదంటూ గవర్నర్‌పై నిందలు !
జగదీష్ రెడ్డి చేసిన దారుణ విమర్శలపై రాజ్ భవన్ స్పందించంది. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్ స్పష్టం చేసింది.
రాజ్ భవన్ అసలు ఆహ్వానం పంపలేదని స్పష్టం చేస్తూంటే.. రాలేదని మంత్రి విమర్శలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఆహ్వానం పంపామని రాష్ట్ర ప్రభుత్వం అనడం తప్పు అని, గవర్నర్‌కు అసలు ఆహ్వానం ఇవ్వలేదని తెలిపింది. ఆహ్వానం రాకే గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాజ్‌భవన్ మంగళవారం ఓ నోట్ విడుదల చేసింది. ఆహ్వానం పంపి ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. పంపలేదు కాబట్టే సైలెంట్ గా ఉందని తెలుస్తోంది.
పదే పదే గవర్నర్‌ను అవమానిస్తున్న తెలంగాణ ప్రభుత్వం !
గవర్నర్ తమిళిసైను తెలంగాణ ప్రభుత్వం పదే పదే అవమానిస్తోంది. కనీసం ప్రోటోకాల్ కూడా అమలు చేయడం లేదు. గవర్నర్ తాము చెప్పినట్లుగా వినాల్సిందేనన్నట్లుగా ప్రభత్వ తీరు ఉంది. రాజ్యాంగబద్దంగా పని చేస్తే అదేదో నేరం అయినట్లుగా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందన్న విమర్శలు వినిపి్తున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజీ కుదిరిందని అనుకున్నారు కానీ.. తర్వాత యథావిధిగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రథమ పౌరురాలికి ఆహ్వానం పంపకపోగా… పంపినట్లుగా ఊహించుకుని ఆమెపై విమర్శలు చేరడం.. గవర్నర్ పట్ల బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి సాక్ష్యం అని అంటున్నారు.