బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫ్రెండ్లీ ఫైట్ పాలిటిక్స్ – బీజేపీని టార్గెట్ చేయడమే లక్ష్యం !

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తమ మధ్యే ఫైట్ జరుగుతోందన్న అభిప్రాయం కల్పించేందుకు రోజుకో వివాదం సృష్టించుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి తానా సభల్లో అన్న ఒక్క మాటను ఇక్కడ రాజకీయం చేసి..దాని మీదనే గెలిచేద్దామన్నట్లుగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తూండటం… కాంగ్రెస్ పార్టీకి్ కూడా కలసి వస్తోంది. మరో పార్టీ రేసులో లేదని.. తామిద్దరమే పోటీ పడుతున్నామన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు ఇద్దరూ పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్ తో పోరాటమంటూ ఆ పార్టీని లేపుతున్న బీఆర్ఎస్

తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర పూరితంగా రాజకీయాలు కూడా తమ మధ్యే జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. పాత విషయాల్ని తెరపైకి తెచ్చి.. గట్టిగా పోరాడుతున్నట్లుగా ప్రజలకు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రైతులకు ఎక్కడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం లేదని నిరూపించే ప్రయత్నం చేశారు. అదే సవాల్ చేసి.. సబ్ స్టేషన్ల వద్ద చర్చకు రావాలంటున్నారు. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న సబ్ స్టేషన్ల పరిధిలో తాము ఓట్లు అడగబోమని.. ఇవ్వని చోట మీరు అడగవద్దని అంటున్నారు. పదకొండు గంటలే కరెంట్ ఇస్తోందని కాంగ్రెస్ చెబుతోంది. ఈ పోరాటం పేరుతో రెండు పార్టీలు రోడ్డెక్కి.. తమ మధ్యే పోరాటం ఉందన్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

బీఆర్ఎస్‌ను గెలిపించేందుకే కాంగ్రెస్ కుట్ర

రైతులకు పదకొండు గంటల కరెంట్ ఇస్తున్నారని కాంగ్రెస్ కూడా నిరూపిస్తోంది. అంటే దీనర్థం ఏమిటి… ఎనిమిది గంటల విద్యుత్ ఉంటేనే రైతులకు మూడు పంటలకు సరిపడా నీరు వస్తుందని ఇదే రేవంత్ రెడ్డి చెప్పారు. మరి పదకొండు గంటల కరెంట్ తెలంగాణ సర్కార్ ఇస్తోందని ఆ పార్టీనే సర్టిఫికెట్ ఇవ్వడం దేనికి సంకేతం. కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు.. బీజేపీ గెలవకుండా.. బీఆర్ఎస్ నే మళ్లీ గెలిపించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నమే ఇది. బీజేపీ రేసులో లేదని చెప్పడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరుగుతుందని… ఆ పార్టీకి కూడా.. డిసైడైపోయి… బీఆర్ఎస్‌కు తాకట్టు పెట్టే సుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బీజేపీ ఈ కుట్రల్ని చేధించగలదా ?

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటై.. విడివిడిగా.. బీజేపీని కనిపించనీయకుండా చేస్తున్న రాజకీయంలో… ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మీడియా అంతా వర్గాలుగా విడిపోయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.. బీఆర్ఎస్ కు .. మేలు చేసేలా వ్యవహరిస్తున్నాయి. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఊహించని సవాళ్లు ఎదురు కానున్నాయి. అయితే అలాంటివాటిని ఆయన సులువుగానే ఎదుర్కొంటారని… ఆ రెండు పార్టీల కుట్రల్ని ప్రజల ముందు ఉంచుతారన్న నమ్మకంలో బీజేపీ శ్రేణులున్నాయి.